Black Pepper | మిరియాలలో చాలా రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. మనం ఎక్కువగా నల్ల మిరియాలను వంటల్లో ఉపయోగిస్తుంటాం. ఇవి ఘాటుగా ఉంటాయి. కనుక మసాలా వంటకాల్లో వీటిని ఎక్కువగా వేస్తుంటారు. మిరియాలలో పైపరైన్ అనే సమ్మేళనం ఉంటుంది. అందువల్లే ఇవి ఘాటుగా ఉంటాయి. ఆయుర్వేదంలో మిరియాలకు ఎంతగానో ప్రాధాన్యతను కల్పించారు. వీటిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. పలు ఆయుర్వేద మందలు తయారీలోనూ నల్ల మిరియాలను ఉపయోగిస్తుంటారు. అయితే మనకు కలిగే పలు వ్యాధులు లేదా అనారోగ్య సమస్యలను నల్ల మిరియాలను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో నల్ల మిరియాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ఏయే వ్యాధులను తగ్గించుకునేందుకు నల్ల మిరియాలను ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులను తగ్గించడంలో మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందుకు గాను అర టీస్పూన్ మిరియాల పొడిని 1 టేబుల్ స్పూన్ తేనెతో కలిపి రోజుకు 3 సార్లు తీసుకుంటుండాలి. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తులు, గొంతులో ఉండే కఫం పోతుంది. ముక్కు దిబ్బడ తగ్గుతుంది. శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గాలి సరిగ్గా లభిస్తుంది. అలాగే ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని మిరియాలు, కొద్దిగా అల్లం, కొన్ని తులసి ఆకులు, కొద్దిగా పసుపు, కొన్ని లవంగాలను వేసి బాగా మరిగించాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీన్ని రోజుకు 2 సార్లు తాగితే దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇతర శ్వాసకోశ సమస్యలు సైతం తగ్గిపోతాయి.
కొద్దిగా మిరియాల పొడిని, పసుపును తీసుకుని ఈ మిశ్రమాన్ని గోరు వెచ్చని పాలలో కలిపి రాత్రి పూట తాగుతుండాలి. దీని వల్ల కూడా సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబుకు ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. కఫం కరిగిపోతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు ఒక గ్లాస్ మజ్జిగలో కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర పొడి కలిపి తాగుతుంటే ఫలితం ఉంటుంది. దీని వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా మిరియాల పొడి, కొంచెం నల్ల ఉప్పు వేసి కలిపి అందులోనే నిమ్మరసం పిండి కలిపి తాగాలి. ఈ మిశ్రమాన్ని భోజనానికి 30 నిమిషాల ముందు రోజుకు 2 సార్లు సేవించాలి. ఇలా చేస్తున్నా కూడా జీర్ణ శక్తి పెరుగుతుంది. అసిడిటీ సమస్య తగ్గుతుంది.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి ఈ నీళ్లను గొంతులో పోసుకుని పుక్కిలిస్తుండాలి. దీంతో గొంతులో ఉండే కఫం పోతుంది. అలాగే గొంతులో గరగర, నొప్పి, మంట, వాపు తగ్గిపోతాయి. నల్ల మిరియాలలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, అనాల్జెసిక్ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల ఇవి ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. మార్కెట్లో మనకు బ్లాక్ పెప్పర్ ఎసెన్షియల్ ఆయిల్ లభిస్తుంది. దీన్ని నువ్వుల నూనెతో కలిపి వాడుకోవాలి. కొన్ని చుక్కల బ్లాక్ పెప్పర్ ఎసెన్షియల్ ఆయిల్‌ను తీసుకుని నువ్వుల నూనెతో కలిపి ఈ మిశ్రమంతో కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్న చోట మర్దనా చేస్తుంటే నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ మిశ్రమాన్ని వాడితే కండరాల నొప్పులు సైతం తగ్గిపోతాయి. అలాగే మీరు రోజూ తాగే గ్రీన్ టీలో కొద్దిగా మిరియాల పొడి కలిపి రోజుకు 2 సార్లు తాగుతుంటే శరీర మెటబాలిజం పెరిగి క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇలా మిరియాలతో మనం అనేక లాభాలను పొందవచ్చు.