Uri 2016 To Pahalgam 2025 | గత నెల పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యకు దిగింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాయాదిదేశంపై మెరుపు దాడులు చేసింది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. జైషే మహమ్మద్, మురిద్కే లష్కరే తోయిబా క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. తాజా ఘటన నేపథ్యంలో గతంలో పాక్‌పై భారత్ ప్రతీకార దాడుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
యురి సర్జికల్ స్ట్రైక్స్..
2016 అక్టోబర్ 16న ఉదయం 5:30 గంటలకు జమ్ముకశ్మీర్ యురి (Uri Attack) లోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో భారతదేశానికి చెందిన దాదాపు 10 మందికిపైగా సైనికులు వీరమరణం పొందారు. కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే ఉగ్రవాదులు 15 కు పైగా గ్రనేడ్లను శిబిరంపైకి విసిరారు. ఈ దాడిలో భారత ఆర్మీకి చెందిన 19 మంది సైనికులు వీరమరణం పొందారు. చాలామంది గాయాలపాలయ్యారు. నలుగురు ఉగ్రవాదులు నియంత్రణ రేఖను దాటి వచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం 10 రోజుల తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేపట్టి పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను బూడిద చేసింది.
దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం కోసం వేచివున్న భారత సైనికులు.. పాక్ సరిహద్దుల్లోని ఉగ్ర శిబిరాలపై సెప్టెంబర్ 28-29 రాత్రి సర్జికల్ స్ట్రైక్ చేపట్టారు. మూకుమ్మడిగా వైమానిక దాడి చేసి అనేక శిక్షణా శిబిరాలను బూడిద చేశారు. భీంబర్, కెల్, తట్టపాణి, లిపా ప్రాంతాల్లోని అనేక ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లను నేలమట్టం చేశారు. మొత్తం దాడి ప్రణాళికతో చేపట్టారు. దీని గురించి పాకిస్థాన్ సైన్యానికి వీసమెత్తు కూడా తెలియదు. రా, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఈ మిషన్‌లో ఉగ్రవాదుల ప్రతి కదలికను జాగ్రత్తగా పర్యవేక్షించాయి. ఉదయాన్నే ఆపరేషన్ పూర్తి చేసిన తర్వాత భారత సైన్యం తిరిగి వచ్చింది. ఈ దాడిలో 38 మంది ఉగ్రవాదులు మరణించినట్లు భారత సైన్యం అప్పట్లో ప్రకటించింది.
బాలాకోట్‌పై సర్జికల్ స్ట్రైక్స్..
2019 ఫిబ్రవరి 14 న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న కాన్వాయిని తీవ్రవాదులు పేల్చేశారు. ఈ పేలుడులో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఉగ్రదాడి జరగడంతో రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఇది జరిగిన సరిగ్గా 12 రోజులకు.. అంటే 2019 ఫిబ్రవరి 26న, భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్-2000 విమానం రాత్రి వేళ నియంత్రణ రేఖ (ఎల్ఓసి)ను దాటి పాకిస్థాన్ వైపున ఉన్న బాలాకోట్‌లోని జైష్-ఎ-మహ్మద్ శిక్షణా శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ (Balakot Air Strike) చేసింది.
పాకిస్తాన్ ఈశాన్య ప్రాంతమైన ఖైబర్ పఖ్తున్ఖ్వా తీవ్రవాదుల అడ్డాను తునాతునకలు చేశారు. ఈ సర్జికల్ స్ట్రైక్‌లో చాలా మంది తీవ్రవాదులు చనిపోయినప్పటికీ పాకిస్థాన్ మిన్నకుండి పోయింది. మరుసటి రోజు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం పాకిస్థాన్ చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 కూల్చివేసింది. పాకిస్థాన్ కూడా మన మిగ్-21 విమానాన్ని కూల్చివేసి, వింగ్ కమాండర్ అభినందన్‌ను అరెస్టు చేసింది. అయితే మూడు వైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాకిస్థాన్ ప్రభుత్వం రెండు రోజుల తర్వాత అభినందన్‌ను క్షేమంగా భారత్‌కు అప్పగించారు.
ఆపరేషన్ సిందూర్..
ఏప్రిల్ 22న మధ్యాహ్నం వేళ జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్లోగల మినీస్విట్జర్లాండ్గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఈ ఘటన జరిగిన 15 రోజుల తర్వాత భారత్ ప్రతీకారానికి దిగింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో.. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ విరుచుకుపడింది. ఈ ప్రతీకార దాడిలో దాదాపు 80 మందికిపైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ స్ట్రైక్స్‌కు ఆపరేషన్ సిందూర్ పెట్టడానికి బలమైన కారణమే ఉంది. పహల్గాం ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఈ పేరు పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ పేరును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సూచించినట్లు సమాచారం. యోధులకు పెట్టే వీరతిలకం అనే అర్థం కూడా దీనిలో ఉందని చెబుతున్నారు.
Also Read..
bomb threat | ఆ విమానాన్ని పేల్చేస్తాం.. ముంబై ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు కాల్
Operation Sindoor: మిస్సైల్ దాడి.. భారీగా పేలుడు.. బైక్‌పై జనం పరుగులు.. ఆపరేషన్ సిందూర్ వీడియో
Operation Sindoor | ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న పాక్.. ఫ్యాక్ట్ చెక్‌తో తిప్పికొట్టిన భారత్