Pregnant Woman | ఉత్తరప్రదేశ్‌లోని లక్నో (Lucknow)లో విషాద ఘటన చోటు చేసుకుంది. కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఓ మహిళ.. పెళ్లైన ఐదు నెలలకే తనువు చాలించింది. భర్త వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. అయితే, భర్త మాత్రం తన భార్య ఆత్మహత్య చేసుకుందని చెప్తుండగా.. యువతి కుటుంబం మాత్రం కట్నం కోసం తమ బిడ్డను హింసించి హత్య చేశారని ఆరోపిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన అనురాగ్ సింగ్ హాంకాంగ్‌కు చెందిన షిప్ మేనేజ్మెంట్ సంస్థలో సెకండ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి మధు (32) అనే మహిళతో ఈ ఏడాది ఫిబ్రవరి 25న వివాహం జరిగింది. అయితే, వివాహం సమయంలో రూ.15 లక్షలు కట్నం డిమాండ్ ( Dowry Demands) చేసినట్లు యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా యువతి ఫ్యామిలీ చూపించింది. పెళ్లి సమయంలో రూ.5 లక్షలు ఇవ్వగలిగినట్లు చెప్పారు. అయితే, పెళ్లైన తర్వాత అనురాగ్ తనకు కట్నం కోసం పదేపదే ఫోన్ చేసి ఒత్తిడి చేశాడని మధు తండ్రి ఫతే బహదూర్ సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లైన నెలలోపే తొలిసారి తన కూతురు మధుపై అల్లుడు అనురాగ్ దాడి చేశాడని, దీంతో ఆమె పుట్టింటికి తిరిగి వచ్చినట్లు చెప్పారు. అడిగిన కట్నం చెల్లించామని.. దీంతో బిడ్డను తిరిగి తీసుకెళ్లినట్లు వివరించారు. అయితే, తన కూతురిని హింసించడం మాత్రం ఆపలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భార్య ప్రెగ్నెంట్.. ఇంకో అమ్మాయితో హోటల్‌కు..
అంతేకాదు అనురాగ్ వేరే అమ్మాయితో వివాహేతర సంబంధంలో ఉన్నాడని ఆరోపించారు. ఇటీవలే ఓ హోటల్లో తన మాజీ ప్రియురాలితో ఓ రాత్రి గడిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. జులై 31న హోటల్ బుకింగ్‌కు సంబంధించిన వివరాలను కూడా ఫిర్యాదులో పంచుకున్నారు. ఆగస్టు 3 ఆదివారం నాడు అనురాగ్ తనపై దాడి చేసినట్లు మధు తన అక్క ప్రియతో చెప్పినట్లు యువతి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురు గర్భవతి అని, తనను కడుపు తీయించుకోమని ఒత్తిడి చేసినట్లు చెప్పారు. ‘ఆగస్టు 4న సాయంత్రం 4:32 గంటలకు అతను ఫోన్ చేసి నా కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెప్పాడు. అతడే నా కూతురిని చంపాడని నేను అనుకుంటున్నాను’ అని మధు తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనతో కలిసి డ్రింక్ చేయమని ఒత్తిడి తెచ్చేవాడు..
మరోవైపు మధు అక్క ప్రియ మాట్లాడుతూ.. ‘నా చెల్లి చాలా లైవ్లీ పర్సన్. కానీ అనురాగ్ మాత్రం ఆమె ఎవరితోనూ మాట్లాడటం ఇష్టపడేవాడు కాదు. స్నేహితులతో కూడా మాట్లాడనిచ్చే వాడు కాదు. ఆఖరికి మాతో కూడా మాట్లాడొద్దని చెప్పేవాడు. అతను ఊర్లో లేనప్పుడు మాత్రమే మేము మాట్లాడుకునే వాళ్లం. ఆమె ఫోన్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేవాడు. ఎటువంటి కారణం లేకుండానే మా చెల్లిని కొట్టేవాడు. తనతో కలిసి డ్రింక్ చేయమని ఒత్తిడి తెచ్చేవాడు. చివరి సారిగా తనతో మాట్లాడినప్పుడు.. అనురాగ్ కొట్టినట్లు చెప్పింది. అప్పుడు తనని ఇంటికి తీసుకురావాలని అనుకున్నాను. కానీ మళ్లీ గొడవ జరుగుతుందనే భయంతో ఆగిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది.
పనిమనిషిని రావొద్దని మెసేజ్ పెట్టి..
యువతి ఫ్యామిలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనురాగ్‌ను విచారించారు. అయితే, ఆగస్టు 4న మధ్యాహ్నం సమయంలో 112 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినట్లు అనురాగ్ పోలీసులకు చెప్పాడు. కానీ మధు కుటుంబానికి మాత్రం ఐదు గంటలు ఆలస్యంగా సాయంత్రం 4:30 గంటలకు కుమార్తె మరణ వార్త సమాచారం అందింది. ఆరోజు పనిమనిషిని కూడా ఇంటికి రావొద్దని అనురాగ్ మెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కానీ, ఆ మెసేజ్ చూసుకోకుండా మెయిడ్ ఇంటికి వచ్చింది. ఆమె చాలాసార్లు మెయిన్ డోర్ బెల్ కొట్టినా ఎవరూ తలుపు తెరవలేదు.
అంతేకాదు, ఆ రోజు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అనురాగ్ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణ సమయంలో.. మధు ఆత్మహత్య చేసుకుందని అనురాగ్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అందుకు కారణాలు ఏంటని అడగ్గా అతడి నుంచి సమాధానం రాలేదని పేర్కొన్నారు. ఈ మేరకు అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే, కస్టడీలోకి తీసుకున్న తర్వాత అనురాగ్ సిగరెట్లు అడుగుతూనే ఉన్నాడని పోలీసులు తెలిపారు.
Also Read..
Suicide | ఉరేసుకుని ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య