UP Man Kills Wife | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని గోరఖ్‌పూర్ (Gorakhpur)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భార్య రహస్యంగా మొబైల్ ఫోన్ వాడుతోందన్న కోపంతో ఓ భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా దృశ్యం సినిమా (Drishyam Style) తరహాలో మృతదేహాన్ని ఇంటి వెనుకే గొయ్యి తీసి పాతిపెట్టాడు. తన భార్య ఆత్మహత్య చేసుకుందని పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు.
లుథియానాలో కూలీగా పనిచేస్తున్న అర్జున్.. ఈనెల 21న గోరఖ్‌పూర్‌లోని ఇంటికి తిరిగొచ్చాడు. ఆ సమయంలో అతడి భార్య ఖుష్బూ రహస్యంగా మొబైల్ ఫోన్ వాడుతుండటాన్ని గమనించాడు. ఈ విషయంపై ఆమెను ప్రశ్నించాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అర్జున్.. తన భార్య గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి వెనుక గొయ్యి తవ్వి పాతిపెట్టాడు.
అనంతరం ఖుష్బూ ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులను నమ్మించాడు. రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఖుష్బూ తండ్రికి అనుమానం వచ్చింది. అల్లుడే తన కూతురిని ఏదో చేశాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అర్జున్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. మృతదేహాన్ని నదిలో పడేశానని చెప్పాడు. అంతేకాదు పోలీసులను గ్రామ సమీపంలోని నది వద్దకు తీసుకెళ్లి గంటల తరబడి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు.
దాదాపు రెండు గంటల తర్వాత పోలీసులు అర్జున్ను మళ్లీ విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా ఇంటి వెనుక ఖుష్బూ మృతదేహాన్ని వెలికి తీసినట్లు గోరఖ్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ శిల్పా కుమారి తెలిపారు. భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. ఇక వీరిద్దరికీ రెండేళ్ల క్రితం వివాహం జరగ్గా.. ఇప్పటి వరకూ పిల్లలు లేరు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అర్జున్ను అరెస్ట్ చేశారు. అనంతరం ఖుష్బూ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read..
Massive Fire | రాంచీలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
Railway Ticket Fares | ప్రయాణికులకు అలర్ట్.. పెంచిన రైలు చార్జీలు నేటి నుంచి అమల్లోకి
Earthquake | గుజరాత్‌లోని కచ్‌లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు