Uttar Pradesh | న్యూఢిల్లీ, జనవరి 2: ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్ ఎంచుకున్న ‘బుల్డోజర్ న్యాయం’.. ఇప్పుడు అక్కడి అధికారుల మెడకు చుట్టుకుంది. ఓ జర్నలిస్ట్ ఇంటిని అక్రమంగా కూల్చేశారన్న కేసులో.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఐఏఎస్ అధికారి, జిల్లా పోలీసులు, ఇంజినీర్లు సహా మొత్తం 26 మంది అధికారులపై క్రిమినల్ కేసు నమోదైంది. నేరపూరిత కుట్ర, నకిలీ పత్రాలు సృష్టించటం, చట్టాన్ని ఉల్లంఘించటం సహా మొత్తం 16 నేరాల్ని వారిపై మహారాజ్‌గంజ్ జిల్లా పోలీసులు నమోదుచేశారు. కూల్చివేతలకు ఆదేశాలిచ్చిన ఆనాటి జిల్లా కలెక్టర్ అమర్నాథ్ ఉపాధ్యాయ, అడిషనల్ కలెక్టర్ కుంజ్ బిహారీ అగర్వాల్, మహారాజ్‌గంజ్ మున్సిపల్ ఈవో రాజేశ్ జైశ్వాల్, ఎస్ఈ మనికాంత్ అగర్వాల్, ఇతర ఇంజినీర్లు, స్థానిక ఎస్ఐ, ఇతర అధికారులను నిందితులుగా ఎఫ్ఐఆర్ పేర్కొన్నది. సీనియర్ జర్నలిస్టు మనోజ్ తిబ్రేవాల్ ఆకాశ్‌కు చెందిన రెండంతస్తుల ఇల్లు అక్రమంగా కూల్చివేశారన్న ఘటనలో బాధ్యులపై చర్యలు చేపట్టాలంటూ సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్‌లో యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. మనోజ్ తిబ్రేవాల్ ఆకాశ్‌కు రూ.25 లక్షలు నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నది. ‘బుల్డోజర్ న్యాయం చెల్లుబాటు కాదు. ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు’ అంటూ యోగి సర్కార్‌కు స్పష్టంచేసింది.
2019 సెప్టెంబర్ 13న మహారాజ్‌గంజ్ పట్టణంలోని జర్నలిస్టు తిబ్రేవాల్ ఇంటిని అధికారులు అక్రమంగా కూల్చివేయటం వివాదానికి దారితీసింది. లీగల్ నోటీసులు ఇవ్వకుండా, నష్టపరిహారం చెల్లించకుండా.. కొన్ని నిమిషాల వ్యవధిలో బుల్డోజర్తో ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఇంటితోపాటు, అందులోని మెడికల్ షాప్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. నగదు, ఇతర విలువైన వస్తువులు తీసుకోనివ్వకుండా, తన తల్లిని, గర్భంతో ఉన్న వదినను పోలీసులు బలవంతంగా బయటకు పంపారని తిబ్రేవాల్ ఆరోపించారు. ఇంటి జాగాలో కేవలం 5 అడుగులు మాత్రమే రహదారి విస్తరణలో పోతుందని అధికారులు తొలుత చెప్పారని, ఒక్క రాత్రిలో ప్లాన్ అంతా మార్చేసి.. ఇంటినంతా కూల్చేశారని ఆయన పేర్కొన్నారు. రహదారి విస్తరణకు సంబంధించి అధికారులు అవినీతి, ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని, అందువల్లే ముందు అనుకున్న ప్లాన్ మారిందని చెప్పారు.