లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏడో తరగతి బాలికకు ఫీజు మినహాయింపు ఇస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) హామీ ఇచ్చారు. అయితే ఆమె చదువుతున్న ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే స్కూల్ దీనికి నిరాకరించింది. ఫీజు చెల్లించాలని ఖరాఖండీగా చెప్పింది. దీంతో ఆ బాలిక కుటుంబం అయోమయంలో పడింది. గోరఖ్‌పూర్‌కు చెందిన రాజీవ్ కుమార్ త్రిపాఠి కాలుకు ఒక ప్రమాదంలో తీవ్ర గాయమైంది. దీంతో అతడు ఉద్యోగం కోల్పోయాడు. ఈ నేపథ్యంలో అతడి కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది.
కాగా, రాజీవ్ కుమార్ ఇద్దరు పిల్లలు గోరఖ్‌పూర్‌లోని పక్కీబాగ్లో ఉన్న సరస్వతి శిశు మందిర్‌లో చదువుతున్నారు. ఆర్ఎస్ఎస్ విద్యా విభాగమైన విద్యాభారతి నిర్వహిస్తున్న ఈ స్కూల్లో అతడి కుమార్తె పంఖూరి త్రిపాఠి 7వ తరగతి చదువుతున్నది. ఆ బాలిక నుంచి నెలకు రూ.1,650 ఫీజు వసూలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె ఫీజు చెల్లించకపోవడంతో రూ.18,000 బకాయి ఉన్నది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆ బాలిక స్కూల్‌కు వెళ్లడం లేదు.
మరోవైపు ఐఏఎస్ అధికారిణి కావాలన్న తన కుమార్తె ఆశయం కోసం ఆమె చదువుకు ఆటంకం కలుగకూడదని తండ్రి రాజీవ్ కుమార్ భావించాడు. దీంతో జూలై 1న తన కుమార్తెతో కలిసి ముఖ్యమంత్రి జనతా దర్బార్‌కు హాజరయ్యాడు. యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి తమ కుటుంబం ఇబ్బందుల గురించి తెలిపాడు. తన చదువుకు సహకరించాలని ఆ బాలిక కోరింది. చాక్లెట్ ఇచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమె చదువుకు ఎలాంటి అడ్డంకులు ఉండవని హామీ ఇచ్చారు. వారి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కాగా, సీఎం యోగి హామీ నేపథ్యంలో రాజీవ్ కుమార్ తన కుమార్తెతో కలిసి ఆ స్కూల్‌కు వెళ్లాడు. ఫీజు మినహాయింపుపై సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పాడు. అయితే స్కూల్ యాజమాన్యం వారితో దురుసుగా ప్రవర్తించింది. ఫీజు మినహాయింపు వంటి నిబంధన ఏదీ లేదని చెప్పింది. ఫీజు బకాయిలు కట్టాల్సిందేనని ఆర్ఎస్ఎస్ స్కూల్ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో ఆ బాలిక ఏడ్వటంతో తండ్రి రాజీవ్ కుమార్ కూడా కంటతడిపెట్టాడు. వారిద్దరూ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
మరోవైపు ఆ రాష్ట్రంలో ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ విషయం తెలుసుకుని అధికార బీజేపీపై మండిపడ్డారు. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ అనే బీజేపీ నకిలీ నినాదాల నిజం ఇదే. పిల్లలకు అబద్ధాలు చెప్పవద్దని బీజేపీని మేం కోరుతున్నాం. ఆమె చదువు ఆగదని హామీ ఇస్తున్నాం’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే ఆ స్కూల్ యాజమాన్యానికి ప్రభుత్వం లేఖ రాసినట్లు విద్యా శాఖ అధికారి తెలిపారు. వారి నుంచి సానుకూల స్పందన ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read:
Watch: రైలు పట్టాల మధ్యలో పడుకున్న బాలుడు, వేగంగా వెళ్లిన రైలు.. తర్వాత ఏం జరిగిందంటే?