హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కార్మికలోకం భగ్గుమన్నది. రెండేండ్లు గడుస్తున్నా కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆగ్రహించిన టీజీఆర్టీసీ జేఏసీ మంగళవారం ‘చలో సచివాలయం’ కార్యక్రమం తలపెట్టింది. అందులో భాగంగా ఇందిరాపార్క్ వద్ద నిరసనకు దిగింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు పదివేల మంది ఆర్టీసీ కార్మికులు తరలివచ్చారు. ధర్నాచౌక్ రోడ్లన్నీ ఆర్టీసీ కార్మికులతో నిండిపోయాయి. రేవంత్‌రెడ్డి సర్కార్ తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ కార్మికులు కన్నెర్ర చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు థామస్‌రెడ్డి, వెంకన్న మాట్లాడుతూ.. ఆర్టీసీ అంటే ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించారు. పరిపాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్‌రెడ్డి దిగిపోవాలని డిమాండ్ చేశారు. మీరిచ్చిన హామీలు కూడా అమలు చేయలేకపోతే ఎలా అని విమర్శించారు. రెండు పీఆర్సీలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియంతా పూర్తి అయినా ముఖ్యమంత్రి ఎందుకు ఆపుతున్నారని నిలదీశారు. హామీలు అమలు చేయకపోతే సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. వేలాది మంది కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు తరలివస్తుంటే, చాలా ప్రాంతాల్లో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అరెస్ట్‌లకు భయపడబోమని హెచ్చరించారు. తాము అధికారంలోకి రావడానికి ఆర్టీసీ కార్మికులను బలి చేశారని, మహాలక్ష్మీ ఉచిత బస్సు పథకం సంస్థకు భారంగా మారిందని పేర్కొన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు రోజుకు 12 నుంచి 14 గంటలు విధులు నిర్వర్తించాల్సి వస్తున్నదని చెప్పారు. రూ.2,350 కోట్ల మహాలక్ష్మీ బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపించారు. ఆ ఆబ్బులు ఆర్టీసీకి ఇస్తే కార్మికుల కష్టాలు తీరుతాయని తెలిపారు.
ఈవీ బస్సుల పేరుతో తమ అనుయాయుల కంపెనీలకు లాభం చేకూరేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈవీ ముసుగులో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే సర్కార్ కుట్రను తిప్పికొడుతామని హెచ్చరించారు. ఆర్టీసీలో యూనియన్లు ఏర్పాటు చేయొద్దంటూ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని, వాటికి భయపడేదే లేదని చెప్పారు. తాము తలుచుకుంటే సర్కార్ రథచక్రాలు ఆగిపోతాయని హెచ్చరించారు. ఏ మహిళలకైతే ఉచిత బస్సు ఇచ్చామని జబ్బలు చరుచుకుంటున్నారో, మేం బస్సులు ఆపేస్తే అదే మహిళలు మిమ్మల్ని దూషిస్తారని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె నిర్ణయాలు కూడా చేస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికే కండక్టర్ల, డ్రైవర్లపై కొందరు అధికారులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, రాత్రీపగలు తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్న కార్మికులపై ఆఫీసుల్లో కూర్చొని పెత్తనం చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు గోపు శ్రీనివాస్, సుజాత, అంజన్న తదితరులు పాల్గొన్నారు.

పరిపాలన ప్రభుత్వమే చేస్తున్నదా?: కూనంనేని
రాష్ట్రంలో పరిపాలన ప్రభుత్వమే చేస్తున్నదా? లేదా అధికారులు చేస్తున్నారో తెలియడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సమస్యలు చెప్పుకోవడానికి కార్మికులను అధికారులు రానివ్వడం లేదని మండిపడ్డారు. ఎమర్జెన్సీ కాలంలో కూడా ఇలా లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి పరిపాలన మీద సరైన అవగాహన లేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు సమస్యల్లో ఉన్నప్పుడు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ చొరవ తీసుకుని పరిష్కరించాలని, కానీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం బాధకరమని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే వచ్చే నష్టమేమీ లేదని స్పష్టంచేశారు. తాపీ మేస్త్రీల ఆదాయం కంటే కూడా ఆర్టీసీ కార్మికుల ఆదాయం తక్కువేనని చెప్పారు. ఈవీ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలనుకోవడం సరైనది కాదని హితవు చెప్పారు. ఏపీలో ఆర్టీసీని విలీనం చేసినప్పుడు తెలంగాణలో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. బస్సు చక్రాలు ఆగితే, రాష్ట్ర ప్రభుత్వ చక్రాలు ఆగిపోతాయని హెచ్చరించారు. అసెంబ్లీలో ఆర్టీసీ కార్మికుల కష్టాలపై నిలదీస్తానని హామీ ఇచ్చారు.
భారీగా మోహరించిన పోలీసులు
‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆంక్షల మధ్య సుమారు పదివేల మంది ఆర్టీసీ కార్మికులు ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. అంత పెద్ద సంఖ్యలో కార్మికులు తరలివస్తారని ఊహించని పోలీసులు తొలుత ధర్నాచౌక్ రోడ్డును బ్లాక్ చేస్తే సరిపోతుందని భావించారు. ఆ మేరకు అరెస్ట్ చేసి తరలించేందుకు వాహనాలు, సిబ్బందిని రంగంలోకి దించారు. కానీ వారు ఊహించని రీతిలో కార్మికులు వస్తూనే ఉండటంతో ధర్నాచౌక్ రోడ్డు జనసంద్రంగా మారింది. డిపోల వారీగా వందలాది మంది కార్మికులు భారీ పోస్టర్లను ప్రదర్శిస్తూ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ధర్నాచౌక్ రోడ్డు వద్ద బారికేడ్లను ఏర్పాటుచేయడంతోపాటు తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ, ఫ్లైఓవర్ కింద, సెక్రటేరియట్ వద్ద అధిక సంఖ్యలో బలగాలను మోహరించారు. చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతోపాటు జేఏసీ నాయకులతో ఫోన్లో చర్చించారు. హామీలు అమలు చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో సెక్రటేరియట్ వైపు వెళ్లే కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు.
మోకాళ్లపై భిక్షాటన
మహిళా కండక్టర్లు, సిబ్బంది మోకాళ్లపై కూర్చొని కొంగు చాపి భిక్షాటన చేస్తూ, బతుకమ్మ పాటలు పాడుతూ సర్కార్‌పై నిరసన వ్యక్తంచేశారు. ‘ఆర్టీసీని ప్రైవేట్‌పరం చెయ్యొద్దు ఉయ్యాలో.. మా బతుకులు ఆగం చేయొద్దు ఉయ్యాలో..’ అంటూ పాటలు పాడారు. హక్కులు అడిగితే కేసులు పెడుతున్నారని, మెమోలు జారీ చేస్తున్నారని మహిళా కండక్టర్లు మండిపడ్డారు. డ్రైవర్లు, కండక్టర్లు లేకుంటే మహాలక్ష్మీ ఉచిత బస్సు ఎలా నడుస్తదని ప్రశ్నించారు. మహిళా కండక్టర్ రిశిత మాట్లాడుతూ.. తమకు నెలనెలా జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. హక్కులు అడిగితే డిపో మేనేజర్లు తమపై కక్ష సాధిస్తున్నారని, డబుల్ డ్యూటీలు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. కాంట్రాక్ట్ కండక్టర్ల పరిస్థితి దారుణంగా ఉన్నదని చెప్పారు. నెలకు రూ.18 వేల జీతం అని చెప్పి రూ.14 వేలు మాత్రమే ఇస్తున్నారని.. అది కూడా వెయ్యి రూపాయలు లంచం ఇస్తేనే జీతం ఇస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దౌర్భాగ్య పాలన గతంలో ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. కండక్టర్ ప్రమీల మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రజలకు దూరం చేసే కుట్రలను తిప్పికొడుతామని అన్నారు. అనేక ఆంక్షల మధ్య వేలాదిగా తరలి వచ్చామని, డిపో మేనేజర్లు ధర్నాకు వెళ్లొద్దని చెప్పినా తాము భయపడలేదని పేర్కొన్నారు.