హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆర్టీసీ సంస్థ ‘మీసేవ’ నుంచి ‘మీ టికెట్ యాప్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ యాప్ నుంచి ఆర్టీసీ టికెట్ కొనుగోలు చేసేవిధంగా ఆధునిక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. మంగళవారం సచివాలయంలో రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, మీసేవ కమిషనర్ రవికిరణ్‌తో కలిసి ‘మీ టికెట్ యాప్’ను ఆవిషరించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ఈ సరికొత్త విధానం ద్వారా ప్రయాణికులు సుదూర ప్రయాణాలు, ఇంటర్ సిటీ బస్సు టికెట్లను డిజిటల్‌గా బుక్ చేసుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. ఈ యాప్ ద్వారా మొత్తం 1,710 ఓపీఆర్ఎస్ సేవలు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. వై నాగిరెడ్డి మాట్లాడుతూ యాప్ ద్వారా 5 రకాల బస్‌పాస్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. ఆర్టీసీలో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు సులభరతర రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, వెంకన్న, ఖుస్రోషా ఖాన్, రాజశేఖర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ప, సీటీఎం శ్రీదేవి, సీఈ(ఐటీ) శ్రీదేవి, హైదరాబాద్, రంగారెడ్డి ఆర్ఎంలు సుధా పరిమళ, శ్రీలత పాల్గొన్నారు.