Waqf Bill | వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేయడంతోపాటు ముస్లిం మహిళలను, ముస్లిమేతరులనూ అందులో సభ్యులుగా చేసేలా రూపొందించిన ‘ద వక్ఫ్ (సవరణ) బిల్లు (Waqf (Amendment) Bill)’ను గురువారం లోక్‌సభలో (Lok Sabha) కేంద్రం ప్రవేశపెట్టింది. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) ఈ సవరణ బిల్లు 2024ను లోక్‌సభ ముందు ఉంచారు.
#WATCH | Union Minister of Minority Affairs Kiren Rijiju moves Waqf (Amendment) Bill, 2024 in Lok Sabha pic.twitter.com/g65rf2tDow
— ANI (@ANI) August 8, 2024
వక్ఫ్ బోర్డులకు అపరిమిత అధికారాలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం కీలక బిల్లును తీసుకురాబోతున్నది. ఇందులో భాగంగా వక్ఫ్ చట్టం-1995 సవరించేందుకు మోదీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. వక్ఫ్ చట్టం-1995 సవరణ బిల్లును రూపొందించింది. అయితే ఈ బిల్లు పార్లమెంట్లో రాజకీయ సునామీ సృష్టించే అవకాశం కనిపిస్తున్నది. బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే, తాము వ్యతిరేకిస్తామని సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. శివసేన (ఉద్ధవ్ వర్గం) కూడా బిల్లుపై మండిపడింది. బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నదని సీపీఎం ఆరోపించింది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకూడదని జేఎంఎం అభిప్రాయపడింది. మరోవైపు వక్ఫ్ బోర్డ్‌ల చట్టబద్ధమైన హోదా, అధికారాల్లో జోక్యం చేసుకుంటే సహించబోమని ‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్’ (ఏఐఎంపీఎల్బీ) ప్రకటించింది.
ముసాయిదా బిల్లులో ఏముంది?
‘భారత సైన్యం, భారతీయ రైల్వేల తర్వాత భారతదేశంలో మూడో అతిపెద్ద భూ యజమానిగా ఉన్న ‘వక్ఫ్ బోర్డు’కు విస్తృత అధికారాలను కట్టబెట్టారు. దాని ఆస్తులు 2009 తర్వాత రెట్టింపు అయ్యాయి’ అని ముసాయిదా బిల్లులో కేంద్రం పేర్కొంది. దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు, అఖారా, ట్రస్ట్‌లు, సొసైటీలకు లేని విస్తృత అధికారాలు, స్వతంత్ర హోదాను వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టారని ప్రతిపాదిత బిల్లులో వివరించారు. తాజా సవరణల ద్వారా వక్ఫ్ ఆస్తులపై కేంద్ర, రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలను కట్టడి చేయడం వల్ల వక్ఫ్ బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శకత ఏర్పడుతుందని కేంద్రం భావిస్తున్నది. సెంట్రల్, స్టేట్ వక్ఫ్ బోర్డులలో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిథ్యం కల్పించాలని బిల్లు పేర్కొన్నది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని బిల్లులో ప్రతిపాదించనుంది. వక్ఫ్ బోర్డులు ఏదైనా భూమి లేదా ఆస్తిని తమదిగా ప్రకటించటం ద్వారా పలు వివాదాలు, అధికార దుర్వినియోగానికి కారణమవుతున్నాయని కేంద్రం తెలిపింది. బిల్లు చట్టరూపం దాల్చితే.. వక్ఫ్ బోర్డులు మునపటిలాగా ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు.
వక్ఫ్ చట్టం అంటే ఏమిటి?
దేశంలో మొదటిసారిగా వక్ఫ్ చట్టాన్ని 1954లో తీసుకొచ్చారు. అనంతరం దానికి మరిన్ని అధికారాలు కట్టబెడుతూ 1995లో చట్టాన్ని సవరించారు. 2013లో మరోసారి సవరించారు. ఇందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం, ఏ కోర్టుల్లోనూ సవాల్ చేయలేని విధంగా, ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే ప్రత్యేక అధికారాలు బోర్డులకు కల్పించారు. నేడు దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులున్నాయి. తమిళనాడులోని వక్ఫ్ బోర్డు తాజాగా ఓ గ్రామం మొత్తం తమదేనంటూ ప్రకటించటం వివాదానికి దారి తీసింది.
Also Read..
PM Modi | వయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
Protests | కూరగాయల ధరల పెరుగుదలపై విపక్షాల ఆందోళన.. ఉల్లిపాయల దండతో ఎంపీల నిరసన
Brain Infection | అరుదైన మెదడు సంబంధిత వ్యాధితో కేరళలో ఐదు మరణాలు : వీణా జార్జ్