Brain Infection | ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (amoebic meningoencephalitis) అనే అరుదైన మెదడు సంబంధిత వ్యాధి ఇప్పుడు భారత్‌లో సంచలనంగా మారింది. ఈ వ్యాధి కారణంగా కేరళ (Kerala) రాష్ట్రంలో ఐదు మరణాలు సంభవించాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ (Veena George) తాజాగా వెల్లడించారు. కలుషిత నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీబా వల్ల ఇన్ఫెక్షన్ సోకడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకూ ఈ మరణాలు నమోదైనట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఈ ఏడాది 15 ప్రాణాంతక మెదడు ఇన్ఫెక్షన్ (fatal brain infection) కేసులు నమోదైనట్లు మంత్రి తెలిపారు. 15 కేసుల్లో ఏడు కేరళ రాజధాని తిరువనంతపురంలో నమోదైనట్లు చెప్పారు. ఇక ప్రస్తుతం తొమ్మిది కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఆరుగురు బాధితులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరో ఇద్దరికి వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నాయి. వారు కూడా ఆసుపత్రిలో చేరారు’ అని మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వ్యాధి బారిన పడి ఆసుపత్రిలో చేరిన వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆరోగ్య మంత్రి వెల్లడించారు.
అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్కు సంబంధించి దేశంలో ఎలాంటి మార్గదర్శకాలు లేవని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ఇది చాలా అరుదైన వ్యాధి అని పేర్కొన్నారు. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడొచ్చని మంత్రి తెలిపారు. వ్యాధి బారిన పడిన వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా ఈ వ్యాధిపై అధ్యయనం, పరిశోధన కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌ని సంప్రదించినట్లు మంత్రి వెల్లడించారు.
మెదడు తినే అమీబా అంటే ఏంటి?
మెదడు తినే వ్యాధి నయిగ్లేరియా ఫ్లవరీ అనే ఏక కణ జీవి ( అమీబా) ద్వారా సోకుతుంది. నదులు, చెరువులు, వాగుల్లోని నీటిలో జీవిస్తుంది. మామూలుగా అయితే ఇది మనుషులకు సోకదు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మాత్రమే కలుషితమైన నీటిలో ఉన్న ఈ నయిగ్లేరియా ఫ్లవరీ మనుషులకు సోకుతుంది. కలుషిత నీరు ఉన్న సరస్సులు లేదా స్విమ్మింగ్ పూల్‌లో స్నానం ఈత కొట్టినప్పుడు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించింది. ఒక్కసారి మానవ శరీరంలోకి రాగానే అది నేరుగా మెదడును చేరుతుంది. అక్కడి మెదడు కణాలను నాశనం చేయడం ద్వారా నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీన్నే నయిగ్లేరియా ఫ్లవరీ ఇన్ఫెక్షన్ అని కూడా అంటారు.
లక్షణాలు ఏంటి?
పీఏఎం ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత బయటపడటానికి ఒక రోజు నుంచి 12 రోజుల వరకు సమయం పట్టవచ్చు. ముందుగా తలముందు భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఆ తర్వాత జ్వరం, తలనొప్పి, గొంతు మంట, నిద్ర మత్తు, వికారం, వాంతులు, మెడ పట్టేయడం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ అమీబా సోకిన తర్వాత 18 రోజుల్లోనే మరణం సంభవించే అవకాశం ఉంది. ఇది అంటువ్యాధి కాదు. మనుషుల ఉంచి మనుషులకు అస్సలు సోకదు. కేవలం కలుషిత నీటిలో ఉన్న అమీబా శరీరంలోకి ప్రవేశించడం ద్వారానే వస్తుంది.
ఈ అమీబా ప్రమాదకరమా?
మెదడు తినే అమీబా చాలా ప్రమాదకరమైనదనే తెలుస్తోంది. ఈ పీఏఎం డెత్ రేటు 97 శాతంగా ఉంది. దీని బారిన పడి కోలుకున్న వారు చాలా తక్కువగా ఉంది. దక్షిణ ఆస్ట్రేలియాలో 1960లో తొలిసారిగా పీఏఎం కేసు వెలుగు చూసింది. అనంతరం క్విన్‌లాండ్, అమెరికాల్లో కేసులు కనిపించాయి. 1962 నుంచి 2001 వరకు అమెరికాలో 154 కేసులు నమోదయ్యాయి. దీంట్లో కేవలం నలుగురు మాత్రమే బతికారంటే ఇది ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో కూడా గతంలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. తొలిసారిగా 2017లో అలప్పుజలోని తిరుమల వార్డులో పీఏఎం కేసు వెలుగు చూసింది. ఆ తర్వాత 2020, 2022లో కోజికోడ్‌లో మరో ఐదు కేసులు నమోదయ్యాయి. వారంతా జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్చ వంటి లక్షణాలతో చనిపోయారు.
నివారణ ఎలా?
పీఏఎం సోకిన వ్యక్తులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోవాలి. యాంటీ ఫంగల్ మందులు వాడాలి. సీడీసీ సూచన మేరకు యాంఫోటెరిసిన్ బీ, అజిత్రోమైసిన్ ఫ్లూనకోనొజొల్, రిఫాంపిన్, మిల్టెఫోసిన్, డెక్సామెథాసోన్ వంటి ఔషధాలను పేషెంట్లకు ఇస్తున్నారు. దీనిద్వారా కోలుకునే అవకాశాలు ఉంటాయి. చాలావరకు ప్రాణాలు కోల్పోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అందుకే పీఏఎం సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నదులు, సరస్సుల్లో స్నానం చేయకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. స్విమ్మింగ్ పూల్‌లో నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. నీటిలోకి దిగినప్పుడు నోస్ క్లిప్స్ వాడటం మంచిది. అలాగే క్లోరిన్‌కు నయిగ్లేరియా ఫౌలేరి అమీబాను చంపే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి స్విమ్మింగ్‌పూల్స్, వాటర్ ట్యాంకులను తరచూ క్లోరినేషన్ చేయాలి.
Also Read..
Bangladesh crisis | బంగ్లాలో అస్థిర పరిస్థితులు.. భారత వీసా సెంటర్లు మూసివేత
Muhammad Yunus | బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నేడు యూనస్ ప్రమాణం
Sheikh Hasina | ఈ కష్టసమయంలో మా అమ్మను చూడలేకపోతున్నా.. హసీనా కుమార్తె భావోద్వేగ పోస్ట్