Muhammad Yunus | పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇవాళ బంగ్లాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus)ను నియమిస్తూ దేశ అధ్యక్షుడు షహాబుద్దిన్ ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇవాళ కొలువదీరనుంది.
తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లను పూర్తిచేసినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమా వెల్లడించారు. బంగ్లాదేశ్ కాలమానం ప్రకారం గురువారం రాత్రి 8 గంటలకు యూనస్ ప్రమాణ స్వీకారం ఉంటుందని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రభుత్వంలో 15 మంది మంత్రులుగా ఉంటారని, వారి నియామకంపై అన్ని రాజకీయ పార్టీల భేటీలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు ప్రస్తుతం పారిస్‌లో ఉన్న మహమ్మద్ యూనస్ నిన్న ప్రత్యేక విమానంలో ఢాకా బయల్దేరారు. ఇవాళ మధ్యాహ్నానికి ఢాకా చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
యూనస్ వైపు విద్యార్థుల మొగ్గు
ఆర్థికవేత్త మహమ్మద్ యూనస్(84) సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విద్యార్థి నేతలు మంగళవారం డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన ‘స్టూడెంట్స్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్’ ప్రతినిధులు మహమ్మద్ యూనస్ పేరును కొత్త ప్రభుత్వాధినేతగా ప్రతిపాదించారు. తాము యూనస్‌తో మాట్లాడామని, ప్రభుత్వాన్ని నడిపించేందుకు ఆయన అంగీకరించారని ‘స్టూడెంట్స్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్’ జాతీయ సమన్వయకర్త నహీద్ ఇస్లాం మంగళవారం ప్రకటించారు. దేశంలో సైనిక పాలనను, సైనిక మద్దతు ఉండే ప్రభుత్వాన్ని, నియంత పాలనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రతిపాదించిన ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించబోమని ఆయన తేల్చిచెప్పారు. దీంతో యూనస్‌ను తాత్కాలిక ప్రధానిగా బంగ్లా అధ్యక్షుడు ప్రకటించారు.
Also Read..
Sheikh Hasina | ఈ కష్టసమయంలో మా అమ్మను చూడలేకపోతున్నా.. హసీనా కుమార్తె భావోద్వేగ పోస్ట్
Gas Leak: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో గ్యాస్ లీక్.. 17 మంది కార్మికులకు అస్వస్థత
Buddhadeb Bhattacharya: బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య కన్నుమూత