Bangladesh crisis | పొరుగు దేశం బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఆర్మీ రంగంలోకి దిగినప్పటికీ శాంతి భద్రతలు అదుపులోకి రానట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బంగ్లాలోని భారత దౌత్యాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు (Indian Visa Centres closed) ప్రకటించారు.
బంగ్లా వ్యాప్తంగా అన్ని వీసా దరఖాస్తు సెంటర్లను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి నోటీసులు వచ్చేంత వరకూ అన్ని సెంటర్లూ మూసే ఉంటాయని స్పష్టం చేశారు. అస్థిర పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తదుపరి దరఖాస్తు తేదీపై ఎస్ఎంఎస్ ద్వారా సమాచారమివ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు భారత వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ పోర్టల్లో సందేశం పెట్టారు.
కాగా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో పొరుగు దేశం బంగ్లాదేశ్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కొలువదీరనుంది.
అయితే, ప్రస్తుతం బంగ్లాలో శాంతి భద్రతలు అదుపులోకి రానట్లు తెలిసింది. రాజధాని ఢాకా సహా అనేక నగరాల్లో నిరసనకారులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. దీంతో అనేక మంది పౌరులు ప్రాణాలను దక్కించుకునేందుకు దేశాన్ని వీడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది ప్రజలు తమకు ఆశ్రయం కల్పించాలంటూ భారత సరిహద్దులకు చేరుకున్న విషయం తెలిసిందే.
Also Read..
Sheikh Hasina | ఈ కష్టసమయంలో మా అమ్మను చూడలేకపోతున్నా.. హసీనా కుమార్తె భావోద్వేగ పోస్ట్
Muhammad Yunus | బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నేడు యూనస్ ప్రమాణం
NASA | వ్యోమగాములు, రోబోలకు ఉపయోగపడేలా.. చంద్రుడిపై నాసా లైట్ హౌజ్!