బెంగళూరు, సెప్టెంబర్ 28: తనపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, 12 ఏండ్ల పాత కేసులో జైలుకు పంపించాలని అనుకుంటున్నదని కేంద్రమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు. అలాంటి పరిస్థితే వస్తే తానే స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ను తాను విమర్శించడం ప్రారంభించిన నాటి నుంచి తనపై సిద్ధరామయ్య సర్కారు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు.
కాంగ్రెస్ నేతల అక్రమాలకు సంబంధించి తన వద్ద ఉన్న పత్రాలు బయటపెడితే సిద్ధరామయ్య మంత్రివర్గంలోని ఆరేడుగురు రాజీనామా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. గత ప్రభుత్వం 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నదని ఆరోపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు అంతకంటే ఎక్కువ శాతం కమీషన్లు తీసుకుంటున్నట్టు కాంగ్రెస్ వారే చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా, కుమారస్వామి ఆరోపణలు కేవలం అబద్ధాలని సిద్ధరామయ్య పేర్కొన్నారు.