Bharat Bandh : రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న భారత్ బంద్కు సంబంధించి కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు రెండు అంశాలకు సంబంధించినదని, ఒకటి క్రీమిలేయర్ కాగా, మరొక అంశం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిందని మంత్రి వివరించారు. ఈ అంశాల్లో ఒక దానిపై సర్వోన్నత న్యాయస్ధానం కొన్ని వ్యాఖ్యలు చేసిందని, కోర్టు అభిప్రాయం తీర్పులో భాగం కాదని స్పష్టం చేశారు.
క్రీమీ లేయర్ నిర్ణయం ఎస్సీ, ఎస్టీలకు వర్తిస్తుందని విపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని బీజేపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆగస్ట్ 9న వినతి పత్రం సమర్పించారు. కేబినెట్ నిర్ణయం అనంతరం క్రీమి లేయర్ ఎస్సీ, ఎస్టీలకు వర్తింపచేయడం లేదని, ఇది తీర్పులో భాగం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారని మంత్రి వివరించారు. ఇక వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాలు రెండు షరతులకు లోబడి నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నదని మంత్రి వివరించారు.
రాష్ట్రాలు లెక్కించదగిన డేటాను సేకరిస్తాయి, వారు ఎవరికి ఇవ్వదలుచుకున్నారో వారికి 100 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేరని స్పష్టం చేసిందని మంత్రి చెప్పారు. విపక్షాలు ఈ అంశంలో అనవసరంగా ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేస్తున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. లేటరల్ ఎంట్రీపైనా విపక్షాలు వివాదం సృష్టించేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
లేటరల్ ఎంట్రీకి అతిపెద్ద ఉదాహరణ యూపీఏ హయాంలో చేపట్టిన డాక్టర్ మన్మోహన్ సింగేనని స్పష్టం చేశారు. ఈ వివాదంపైనా ప్రధాని మోదీ వివరణ ఇచ్చారని, లేటరల్ ఎంట్రీ ప్రకటనలను ఉపసంహరించారని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రధాని మోదీ నిరంతరం పనిచేస్తున్నారని, దీన్ని ఆయన కొనసాగిస్తారని కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ పేర్కొన్నారు.
Read More :