Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోహరులో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్రానంతరం హరియాణ నుంచే త్రివిధ దళాల్లోకి అత్యధిక సంఖ్యలో సైనికులు వచ్చారని అన్నారు. మనం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే పరిస్ధితుల్లో ఉండగా హరియాణ రైతులు దేశాన్ని ఆదుకున్నారని తెలిపారు.
హరియాణ రైతులు చెమటోడ్చి మనకు మిగులు ఆహార ధాన్యాలను అందించారని అన్నారు. ఇక ఒలింపిక్స్, పారాఒలింపిక్స్‌లో అత్యధిక మెడల్స్‌ను దేశానికి హరియాణ అథ్లెట్లు అందించారని వివరించారు. ఇక హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని కేంద్ర మంత్రి, హరియాణ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తుకు ఏ పార్టీ ముందుకు రావడం లేదని చెప్పారు. రిజర్వేషన్లు, సిక్కులపై కాంగ్రెస్ నేతలు అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. హరియాణ సీఎం నయబ్ సింగ్ సైనీ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని అన్నారు. హరియాణలోని ఝజర్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్ల తొలగింపుపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఆలోచనలు బట్టబయలయ్యాయని అన్నారు. విదేశీ గడ్డపై రాహుల్ గాంధీ దేశాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందని మండిపడ్డారు.
Read More :
Devara Movie | ‘దేవర’నా మాజాకా.. భారీ ధరలతో మిడ్నైట్ షోలకు ప్లాన్ చేస్తున్న టీం.!