న్యూఢిల్లీ : పర్యాటకులుగా, విద్యార్థులుగా, చికిత్స కోసం రోగులుగా, వ్యాపారులుగా వచ్చే వారిందరికీ స్వాగతం పలకడానికి భారత్ సిద్ధమేనని, అయితే ఎవరైతే బెదిరింపులకు పాల్పడతారో అటువంటి వారి పట్ల మాత్రం తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మోసపూరిత ఆలోచనలతో భారత్లోకి వచ్చే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, అలాంటి వారికి ఆశ్రయం కల్పించడానికి ఇదేమీ ధర్మసత్రం కాదని వ్యాఖ్యానించారు. వలస, విదేశీయుల బిల్లును గురువారం లోక్సభలో ఆమోదించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకునే వారికి తామెప్పుడూ స్వాగతం పలుకుతామని అన్నారు. ఈ వలస, విదేశీయుల బిల్లుతో దేశ రక్షణ పటిష్ఠం అవుతుందని షా పేర్కొన్నారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు భారత్లోకి అక్రమంగా చొరబడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ వారి వల్ల దేశం అసురక్షితంగా మారిందన్నారు. చొరబాటుదారులు అశాంతి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.