Tirupati laddoos | వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ (Tirupati laddoos) ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లడ్డూ కల్తీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా (asks for report) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరింది.
లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి (Union Health Minister) జేపీ నడ్డా (JP Nadda) తెలిపారు. వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపించాల్సిందిగా కోరినట్లు వివరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ అంశంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
లడ్డూపై వివాదం
కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇప్పుడు దుమారం రేపుతున్నది. వైసీపీ హయాంలో లడ్డూ తయారీ కోసం జంతు కొవ్వు వినియోగించారని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ (ఎన్డీడీబీజీ) సీఏఎల్ఎఫ్ ల్యాబ్ కూడా నిర్ధారించింది. ఈ ఏడాది జూలైలో లడ్డూను ల్యాబ్‌కు పంపగా, అదే నెల 17న నివేదిక వచ్చింది. ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం.. లడ్డూలో ఆవు నెయ్యి, సో యాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మకజొన్న, పత్తి గింజలతోపాటు చేపనూనె, జంతు కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా వాడారు. ఆ రిపోర్టును గురువారం టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియాకు విడుదల చేశారు.
జగన్‌పై ఫిర్యాదు..
ఇక ఈ అంశంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందువుల ఆత్మను హత్య చేశారని వినీత్ జిందాల్ మండిపడ్డారు. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయం పవిత్రతను దారుణంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా, కావాలనే ఇలాంటి చర్యలకు జగన్ మోహన్ రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ క్రమంలోనే జగన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
ఈ వ్యవహారంపై కేంద్ర హోం శాఖతో పాటు ఏపీ, ఉత్తరప్రదేశ్ డీజీపీలకు న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. జగన్‌తో పాటు అప్పటి టీటీడీ పాలకవర్గం, జంతువుల కొవ్వు నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత న్యాయ సంహితలోని 152, 192, 196, 298, 358 సెక్షన్ల కింద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, జాతీయ భద్రతా చట్టం కింద కూడా జగన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read..
Tirumala Laddu | తిరుమల లడ్డూ అంశంపై కేంద్ర మంత్రుల స్పందన.. బాధ్యులను శిక్షించాల్సిందేనంటూ వెల్లడి
Tirumala | తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలు.. చంద్రబాబుపై ఏపీ హైకోర్టులో ఫిర్యాదు