అమరావతి : వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు దేశమంతటా నుంచి సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఏపీ, తెలంగాణకు చెందిన మంత్రులు, రాజకీయ, స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
శుక్రవారం తిరుమల లడ్డూ అంశంపై కేంద్ర ఆహారశాఖ మంత్రి(Food Minister) ప్రహ్లాద్ జోషి(Prahlad Joshi) స్పందించారు. సీఎం చంద్రబాబు చెప్పిన అంశం చాలా తీవ్రమైనది అన్నారు. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. లడ్డూ కల్తీ వ్యవహారం అందరినీ ఆందోళనకు గురి చేసే అంశమని, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.
కేంద్ర సహాయ మంత్రి శోభాకరంద్లాజే ట్వీట్ ద్వారా స్పందిస్తూ తిరుమల కాలేజీల్లో శ్రీవారి ఫొటోలు తొలగించాలని జగన్ అండ్ కో చూసిందని ఆరోపించారు. హిందూయేతర గుర్తులు సప్తగిరులపై ఏర్పాటు చేయాలని చూశారని వెల్లడించారు. హిందువులు కానివారిని బోర్డు చైర్మన్‌గా నియమించారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ హిందువుల ఆత్మను హత్య చేశారని మండిపడ్డారు. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయం పవిత్రతను దారుణంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోం శాఖతో పాటు ఏపీ, ఉత్తరప్రదేశ్ డీజీపీలకు ఫిర్యాదు చేశారు.
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారమని అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూల నాణ్యత సరిగ్గా లేదని గతంలోనే అప్పటి చైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లానని రమణ దీక్షితులు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విచారం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.