Tirumala | తిరుమల లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వులతో తయారు చేసిన నెయ్యిని వాడారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. దీనిపై వైసీపీ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జి లేదా ఒక కమిటీని వేసి విచారణ జరిపించాలని హైకోర్టును కోరారు.
వైసీపీ తరఫు న్యాయవాదులు చేసిన ఫిర్యాదుపై ఏపీ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. పిల్ దాఖలు చేస్తే బుధవారం నాడు వాదనలు వింటామని స్పష్టం చేసింది. కాగా, తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని వాడారని ఏపీ సీఎం చంద్రబాబు నీచమైన ఆరోపణలు చేశారని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గురువారం తీవ్రంగా మండిపడ్డారు.
దేశంలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడని నీచాతినీచమైన మాటలను చంద్రబాబు మాట్లాడారని వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక హిందువుగా వేంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించి పూజ చేస్తానని, కాబట్టి వేంకటేశ్వర స్వామి పాదాల చెంత తన కుటుంబంతో సహా వచ్చి ప్రమాణం చేస్తానని అన్నారు. మీరు కూడా అలాగే ప్రమాణం చేస్తారా అని సవాలు విసిరారు. చంద్రబాబు ఆరోపించినట్లుగా తమ పాలనలో ఎలాంటి ఆక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. మీరు వేసిన నిందలకు కట్టుబడి ఉంటే వచ్చి ప్రమాణం చేయాలని అన్నారు. లేదంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.