Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటనపై యూకే మృతుల కుటుంబాలు (UK families of crash victims) కోర్టులో దావా వేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. పరిహారం విషయంలో ఎయిర్ ఇండియా (Air India), బోయింగ్ (Boeing) సంస్థపై యూకే కోర్టులో దావా వేసేందుకు బాధిత కుటుంబాలు చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం యూకేకి చెందిన న్యాయసంస్థ కీస్టోన్ లాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ దావా వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై కీస్టోన్ లా సంస్థ కూడా స్పందించింది. బాధితులు కొందరు తమను సంప్రదించారని, ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది.
కాగా, గత నెల 12వ తేదీన మధ్యాహ్నం సమయంలో బోయింగ్ సంస్థకు చెందిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరింది. విమానం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఓ బిల్డింగ్‌పై కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంది, ప్రయాణికులు మొత్తం 242 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 241 మంది మరణించారు. మరణించిన ప్రయాణికుల్లో 181 మంది భారతీయులు కాగా, 52 మంది బ్రిటన్ వాసులు. ప్రమాదం అనంతరం ఎయిర్ ఇండియాని నిర్వహిస్తున్న టాటా గ్రూప్ సంస్థ బాధిత కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ప్రకటించింది. ఆ తర్వాత మరో రూ.25 లక్షల పరిహారం ఇస్తున్నట్టు పేర్కొంది. బాధిత కుటుంబాల తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు అదనపు పరిహారం ప్రకటించినట్టు వెల్లడించింది.
Also Read..
Infosys | ఎక్కువ గంటలు పనిచేయొద్దు.. ఉద్యోగులకు ఇన్ఫీ కీలక సూచన
Himachal Pradesh | హిమాచల్‌లో వర్ష బీభత్సం.. నలుగురు మృతి, 16 మంది గల్లంతు
Baba Ramdev | సహజంగానే మనిషి ఆయుర్దాయం 150 నుంచి 200 ఏళ్లు : బాబా రామ్‌దేవ్