ముంబై: బీజేపీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మరోసారి నిప్పులు చెరిగారు. ‘25 ఏండ్లు మేం పాముకు పాలుపోసి పెంచాం. ఇప్పుడది మాపైనే బుస కొడుతున్నది. ఆ పామును ఎలా తొక్కేయాలో మాకు బాగా తెలుసు. మాపై పోరాటానికి ఎవరొస్తారో రండి. మేం సిద్ధంగా ఉన్నాం’ అని బీజేపీకి సవాల్ విసిరారు. మహారాష్ట్రలో రెండున్నర దశాబ్దాల పాటు శివసేన, బీజేపీ మిత్రపక్షాలుగా కొనసాగాయి. గత ఎన్నికల సమయంలో విబేధాలు రావటంతో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహా వికాస్ అఘాడీగా ఏర్పడి శివసేన ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి బీజేపీ, శివసేన కత్తులు దూసుకొంటున్నాయి. ఈ సమావేశానికి హాజరైన ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ మాట్లాడుతూ.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంతటి క్రూరమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని అన్నారు.