Baby died : తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) శివార్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ రెండేళ్ల చిన్నారి ఇంటిముందు ఆడుకుంటూ నీటిగుంటలో పడి మరణించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. విగతజీవిగా పడివున్న తమబిడ్డను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ఓ లిఫ్టు కంపెనీలో పనిచేసే సందీప్ కుమార్, సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసే ప్రియదర్శిని ఇద్దరూ భార్యాభర్తలు. చెన్నై శివార్లలోని మంగాడు ఏరియాలో వారు నివాసం ఉంటున్నారు. వారి రెండేళ్ల కుమార్తె ఉంది. బుధవారం సాయంత్రం తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా పాప ఆడుతూ బయటికి వచ్చింది. ఇంటిముందు ఆడుకుంటూ వెళ్లి పక్క ప్లాట్‌లో నిలిచిపోయిన వరదనీటిలో పడిపోయింది.
కాసేపటికి బయటికి వచ్చిన తల్లిదండ్రులకు పాప కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం కనిపించలేదు. చివరికి పక్క ప్లాట్లోని వరదనీటిలో బాలిక చేయి కనిపించడంతో వెలికితీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ పాప మరణించిందని వైద్యులు ధృవీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.