శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో భారత్-పాక్ సరిహద్దుల్లో దేశంలోకి చొరబడేందుకు (Infiltration Attempt) ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నౌషెరా సెక్టార్లో ఇద్దరు ఉగ్రవాదులు అక్రమంగా సరిహద్దులు దాటేందుకు యత్నించారు. గుర్తించిన సైనికులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరు హతమయ్యారు.
ఎన్కౌంటర్లో చనిపోయిన ఉగ్రవాదుల వద్ద ఏకే 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నదని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ నెల 3న ఇదే ప్రాంతంలో చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపి తప్పించుకున్న విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదులను మట్టుబెట్టింది.