భోపాల్: ఎలుకలు కొరకడంతో ఇద్దరు నవజాత శిశువులు మరణించిన దారుణ ఘటనలు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ దవాఖానలో చోటుచేసుకున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఇండోర్‌లోని మహరాజ యశ్వంత్‌రావు ప్రభుత్వ దవాఖానలో ఈ దారుణాలు జరిగాయి. దవాఖానలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్న దెవాస్ నుంచి రెఫర్ చేసిన ఒక బాలుడు, ఖాండ్వాకు చెందిన బాలికను ఎలుకలు కొరకడంతో మరణించారు.
కాగా, ఈ నవజాత శిశువులిద్దరూ పుట్టుకతో వచ్చిన అనారోగ్య లక్షణాల వల్లే తప్ప ఎలుక కాటు వల్ల చనిపోలేదని డాక్టర్లు తెలిపారు. ఇద్దరి శరీరాలపై ఎలుక కాట్లు ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. నవజాత శిశువులను ఉంచే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఒక పెద్ద ఎలుక తిరుగుతున్న మాట వాస్తవమేనని దవాఖాన సిబ్బంది అంగీకరించారు.