బీజాపూర్: చత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతాదళాలు జరిపిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు(Naxalites Killed) మృతిచెందారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం గన్‌ఫైట్ జరిగింది. భద్రతా దళాలకు చెందిన జాయింట్ టీమ్ .. నక్సల్స్ ఏరివేత ఆపరేషన్‌లో పాల్గొన్నది. మావోయిస్టు కేడర్ ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటి వరకు ఇద్దరు నక్సల్స్ మృతదేహాలను సేకరించినట్లు ఓ అదికారి చెప్పారు. ఆయుధాలను రికవరీ చేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఏకధాటికి ఫైరింగ్ జరుగుతోందని, దీనికి సంబంధించిన మరింత సమాచారం రావాల్సి ఉన్నది. బస్తర్ ప్రాంతంలో జనవరి 3వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది నక్సల్స్ మృతిచెందిన విషయం తెలిసిందే. గత ఏడాది చత్తీస్‌ఘడ్‌లో సుమారు 285 మంది నక్సలైట్లు ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మార్చి 31 వరకు దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయనున్నట్లు కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే.