PM Modi Podcast | అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మ్యాన్ (Lex Fridman) పాడ్‌కాస్ట్ (Podcast)లో ప్రధాని మోదీ (PM Modi) పాల్గొన్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ పాడ్‌కాస్ట్‌లో మోదీ పలు అంశాలపై మాట్లాడారు. భారత్-చైనా మధ్య వైరుద్ధ్యాలు, రష్యా-ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం వంటి అనేక విషయాలపై మాట్లాడారు.
తన స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మోదీ ప్రస్తావించారు. ట్రంప్ హుషారైన, దృఢసంకల్పం గల నేత అని కొనియాడారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్‌కు అమెరికా అభివృద్ధిపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఉందన్నారు. ఇక లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్‌తో మోదీ పాడ్‌కాస్ట్ వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేర్ చేశారు. తన సొంత సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో వీడియోను పంచుకున్నారు.
శాంతికి ప్రయత్నించిన ప్రతిసారి ద్రోహమే ఎదురైంది..
పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌తో శాంతిని నెలకొల్పడానికి భారత్ ప్రయత్నం చేసినప్పుడల్లా శత్రుత్వం, ద్రోహమే ఎదురైందని చెప్పారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనాలన్న ఆశతోనే తొలిసారిగా 2014లో తన ప్రమాణ స్వీకారోత్సవానికి అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించినట్టు చెప్పారు. ఆ దేశంలో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు, అశాంతి పరిస్థితులకు ఎంతోమంది అమాయకులు సమిధలవుతున్నారన్నారు.
వాటితో ఆ దేశ ప్రజలు కూడా విసుగు చెందారన్నారు. శాంతి, సామరస్యాలే తమ విదేశాంగ విధానమని ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలలో భారత్ తన వైఖరి స్పష్టం చేసిందని ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చుకునే బాధ్యత పాక్‌పైనే ఉందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు, తనకు మధ్య పరస్పర విశ్వాసం ఉందని, అన్నింటికంటే జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని తాము భావిస్తామని, అదే తమను బాగా కనెక్ట్ చేసిందని చెప్పారు.
తప్పుడు కథనాలతో ఇరికించాలనుకున్నారు
2002లో గుజరాత్లో గోద్రా అల్లర్ల అనంతరం అప్పట్లో కేంద్రంలో ఉన్న ప్రత్యర్థి పార్టీలు తప్పుడు కథనాల ద్వారా తనను శిక్షించాలని ప్రయత్నించాయని, కానీ కోర్టులు తనకు విముక్తి కల్పించాయని అన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి జీవిత విలువలు నేర్చకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇంత పవిత్రమైన సంస్థలో తానూ భాగస్వామి అయినందుకు అదృష్టవంతుడినని అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో విస్తృతంగా ప్రచారం పొందుతున్న కృత్రిమ మేధ సాంకేతికత గురించి ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ ఇది చాలా శక్తివంతమైనదని అన్నారు. అయితే అది మానవ మేధస్సు ఊహల లోతుకు ఎప్పటికీ సరిపోలకపోవచ్చునని అన్నారు
యుద్ధంతో పరిష్కారం రాదు
ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ సంక్షోభానికి యుద్ధం ద్వారా ఎన్నడూ పరిష్కారం లభించదని, ఇరు వర్గాలు చర్చలకు కూర్చున్నప్పుడు అది సమసిపోతుందని అన్నారు. తనకు రెండు దేశాల అధ్యక్షులతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. చైనా దేశంతో మనకు ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ చర్చలకే తాను ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఇరు దేశాలు ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నానని ప్రధాన మోదీ ఆకాంక్షించారు.
Also Read..
Narendra Modi | శాంతికి ప్రయత్నించిన ప్రతిసారి ద్రోహమే ఎదురైంది.. పాక్‌తో సంబంధాలపై మోదీ
Grenade Attack | అమృత్సర్ ఆలయంపై గ్రెనేడ్ దాడి.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు హతం
Ayodhya | ఐదేండ్లలో ప్రభుత్వానికి 400 కోట్ల పన్ను చెల్లించాం: అయోధ్య రామమందిర ట్రస్ట్