Ayodhya | అయోధ్య : గత ఐదేండ్లలో ప్రభుత్వానికి రూ.400 కోట్లకుపైగా పన్ను చెల్లించినట్టు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం మాట్లాడుతూ, 2020 నుంచి 2025 ఫిబ్రవరి 5 వరకు జీఎస్టీ కింద రూ.270 కోట్లు, ఇతర పన్ను క్యాటగిరీల కింద రూ.130 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.
అయోధ్య రామాలయం ప్రధాన మతపరమైన పర్యాటక కేంద్రంగా మారిందన్నారు. భక్తులు, పర్యాటకుల సంఖ్య 10 రెట్లు పెరిగిందని చెప్పారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. మహా కుంభ మేళా సందర్భంగా 1.26 కోట్ల మంది బాలక్ రామ్‌ను దర్శనం చేసుకున్నారని తెలిపారు. నిరుడు అయోధ్యకు 16 కోట్ల మంది వచ్చారని, 5 కోట్ల మంది రామాలయాన్ని సందర్శించారని వివరించారు. ట్రస్ట్ ఆర్థిక రికార్డులను కాగ్ ఆడిట్ చేస్తుందన్నారు.