న్యూఢిల్లీ, ఆగస్టు 4 : ఉక్రెయిన్‌తో యుద్ధం సాగిస్తున్న రష్యా నుంచి భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై సుంకాలు పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం హెచ్చరించారు. రష్యా నుంచి భారీ మొత్తంలో చమురును కొనుగోలు చేయడమే గాక దాన్ని భారీ లాభాలకు బహిరంగ మార్కెట్లో అమ్ముతోందని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఆరోపించారు. రష్యా సాగిస్తున్న యుద్ధంలో ఎందరు ఉక్రెయిన్ పౌరులు బలవుతున్నారో వారికి(భారత్‌కు) పట్టడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే అమెరికాకు భారత్ చెల్లించే సుంకాన్ని గణనీయంగా పెంచనున్నానని ట్రంప్ హెచ్చరించారు. రష్యా ముడి చమురు కొనుగోలును భారతీయ రిఫైనరీలు నిలిపివేసినట్లు వెలువడిన మీడియా వార్తలను ట్రంప్ ప్రశంసించిన రెండు రోజులకే తాజా హెచ్చరికలు జారీ కావడం గమనార్హం.
ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న యుద్ధానికి నిధులు సమకూరుస్తున్న చమురు కొనుగోళ్లే కాకుండా అమెరికన్ వస్తువులపై భారీ సుంకాలు విధిస్తూ అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థను భారత్ మోసం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి ఆరోపించారు. రష్యాతో చమురు కొనుగోళ్లను నిలిపివేయాలంటూ భారత్‌పై అమెరికా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు వెలువడ్డాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్‌తో రష్యా సాగిస్తున్న యుద్ధానికి భారత్ నిధులు సమకూర్చడం ఆమోదయోగ్యం కాదని ట్రంప్ స్పష్టంగా తెలియచేశారని ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, వైట్ హౌస్‌లో డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఫాక్స్ న్యూస్‌కు చెందిన సండే మార్నింగ్ ఫ్యూచర్స్‌కు తెలిపారు. రష్యా చమురు కొనుగోలులో చైనాతో భారత్‌కు భాగస్వామ్యం ఉందన్న వాస్తవం తెలిస్తే అందరూ దిగ్భ్రాంతి చెందుతారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌తో బలమైన బంధాన్ని ట్రంప్ మొదటి నుంచి కోరుకుంటున్నారని, భారత్‌తో, ప్రధాని నరేంద్ర మోదీతో ఆయనకు గొప్ప బంధం ఉందని మిల్లర్ వ్యాఖ్యానించారు. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు అందుతున్న నిధుల గురించే ట్రంప్ ఆందోళన చెందుతున్నారని, డౌత్యపరంగా, ఆర్థికంగా, ఇతర రూపాలలో దీన్ని అడ్డుకోవడానికి అన్ని ప్రత్యామ్నాయాలను ట్రంప్ తెరచి ఉంచారని ఆయన చెప్పారు.
అయితే ఈ వార్తలు వెలువడిన కొన్ని గంటలకే వీటిని ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. మార్కెట్ శక్తులు, జాతీయ ప్రయోజనాల ప్రాతిపదికన భారతదేశ ఇంధన దిగుమతులు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. రష్యన్ దిగుమతులను భారతీయ చమురు శుద్ధి పరిశ్రమలు నిలిపివేసినట్లు తమకు ఎటువంటి సమాచారం అందలేదని ఆ వర్గాలు తెలిపాయి.