న్యూఢిల్లీ, జనవరి 8: రష్యా నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న దేశాలపై 500 శాతం మేరకు సుంకాలను విధించడానికి అనుమతించే కొత్త బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించారు. వచ్చే వారం సెనేట్‌లో ఓటింగ్ జరగనున్న ఈ బిల్లు ప్రభావం భారత్, చైనాపై ప్రధానంగా పడనున్నది. తెలిసి తెలిసీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్న దేశాలను 500 శాతం మేరకు సుంకాలతో శిక్షించేందుకు అనుమతించే ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ బుధవారం పచ్చజెండా ఊపినట్లు రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహమ్ ఎక్స్ పోస్టులో వెల్లడించారు. బుధవారం జరిగిన నిర్మాణాత్మక సమావేశం తర్వాత ట్రంప్ శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025 బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలియచేసినట్లు గ్రాహమ్ తెలిపారు.
ఈ బిల్లును వచ్చేవారం ప్రారంభంలో సెనెట్‌లో ఓటింగ్‌కు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రాహమ్తోపాటు డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథల్ ప్రతిపాదించిన ఈ బిల్లుతో రష్యన్ చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సాగిస్తున్న యుద్ధానికి ఆర్థిక సహకారం అందచేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలను కట్టడి చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్‌నకు గొప్ప అస్త్రం లభించగలదని దక్షిణ కరోలినా సెనేటర్ గ్రాహమ్ తన పోస్టులో పేర్కొన్నారు. అమెరికా నుంచి రష్యాకు ఇంధన ఉత్పత్తుల ఎగుమతి, ఇంధన రంగంలో పెట్టుబడుల నిషేధానికి కూడా ఉద్దేశించిన ఈ బిల్లుపై ఓటింగ్‌ను సెనేట్ వచ్చే వారానికి వాయిదావేసింది.
చైనా తర్వాత రష్యా నుంచి చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న రెండవ అతిపెద్ద దేశమైన భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై సుంకాలను పెంచడానికి ట్రంప్ సిద్ధపడిన నేపథ్యంలో ఈ బిల్లు సెనేట్ ముందుకు రానున్నది. గత ఏడాది భారతీయ దిగుమతులపై 25 శాతం ప్రతీకార సుంకాలను విధించిన ట్రంప్ ఆ తర్వాత రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకాలు విధించారు. భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన దరిమిలా అమెరికా, భారత్ మధ్య సంబంధాలు క్షీణించాయి. చైనా వస్తువులపై 145 శాతం సుంకాలు విధించడంతో చైనా, అమెరికా మధ్య కూడా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాలను విధించింది. కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారత్‌పై మళ్లీ సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ ఇటీవల సూచనప్రాయంగా హెచ్చరించారు. గత శనివారం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ తాను సంతోషంగా లేనని ప్రధాని నరేంద్ర మోదీకి తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం. వాళ్లు వ్యాపారం చేస్తారు. మేము వాళ్లపై చాలా వేగంగా సుంకాలు పెంచగలము అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌పై రగిలిపోతున్న బంగ్లాదేశ్, భారత్ పత్తినూలు, దారం దిగుమతులపై టారిఫ్‌లు విధించాలని భావిస్తున్నది. దిగుమతులపై గత ఏడాది ఆగస్టు 10 నుంచి అమలవుతున్న డ్యూటీ-ఫ్రీ విధానాన్ని ఎత్తివేసి, 10 నుంచి 20 శాతం సుంకం విధించాలని బంగ్లాదేశ్ కసరత్తు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన అంశంపై బంగ్లాదేశ్ ట్రేడ్, టారిఫ్ కమిషన్ ఈనెల 5న కీలక భేటీ నిర్వహించింది. ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న ద్వైపాక్షిక సంబంధాలు, బంగ్లాదేశ్ వాణిజ్య నివేదికలను ఉటంకిస్తూ భారతీయ నూలు పరిశ్రమ వర్గాలు తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాయి. ముడి పత్తిని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి. దీంట్లో అత్యధిక భాగం భారత్ నుంచే దిగుమతి అవుతున్నది.