భోపాల్: భూ కబ్జాపై పలుమార్లు ఫిర్యాదు చేసిన గిరిజన మహిళలు విసిగిపోయారు. చివరకు అధికారిణి కాళ్లపై పడి న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో స్పందించిన అధికారిణి వారి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది. (Tribal Women Fall At Officer’s Feet) మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలోని గిరిజనుల భూములను మాఫియాదారులు ఆక్రమిస్తున్నారు. వారి కబ్జా నుంచి తమ భూములను కాపాడాలంటూ అధికారుల చుట్టూ గిరిజనులు తిరుగుతున్నా ఫలితం లేకపోతున్నది.
కాగా, ఖిర్ఖిరి గ్రామానికి చెందిన గిరిజనురాలు సావిత్రి బాయి భూమిని గ్రామంలోని ప్రముఖ వ్యక్తులు కబ్జా చేశారు. ఆమె గుడిసెను కూల్చివేశారు. ఏళ్లుగా నివసిస్తున్న వారి భూమిని బలవంతంగా ఆక్రమించుకున్నారు. అందులో బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో సావిత్రి బాయి స్థానిక పోలీసులకు, తహసీల్ కార్యాలయంలో పలుసార్లు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఎవరూ స్పందించలేదు.
మరోవైపు తమ భూమి ఆక్రమణ గురించి మరోసారి ఫిర్యాదు చేసేందుకు సావిత్రి బాయి తన కోడలితో కలిసి తహసీల్ కార్యాలయానికి చేరుకున్నది. తహసీల్దార్ రోష్ని షేక్ కార్యాలయం నుంచి వెళ్లటాన్ని వారు చూశారు. మెట్లు దిగుతున్న ఆ అధికారిణి కాళ్లపై గిరిజన మహిళలు పడ్డారు. ఆమె కాళ్లుపట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. లేకపోతే ఆత్మహత్యే శరణ్యమని అన్నారు.
కాగా, తహసీల్దార్ రోష్ని షేక్ చలించిపోయారు. ఆ అధికారిణి కూడా మెట్లపై కూర్చొని గిరిజన మహిళల సమస్య విన్నారు. తాను వ్యక్తిగతంగా దర్యాప్తు చేస్తానని హామీ ఇచ్చారు. వారి ఫిర్యాదును పరిశీలించాలని స్థానిక అధికారులకు చెప్పారు. ఆక్రమణ నుంచి వారి భూమిని విడిపించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read:
Lawyer Rapes Woman | కేసు పరిష్కారం కోసం పిలిచి.. మహిళపై న్యాయవాది అత్యాచారం
Model Dies | మోడల్ అనుమానాస్పద మృతి.. హాస్పిటల్లో వదిలేసి ప్రియుడు పరార్
Watch: రైలు కోచ్‌లో స్నానం చేస్తూ యువకుడు రీల్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?