Travel Advisory | ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పాకిస్తాన్, పీవోకేలోని తొమ్మిది చోట్ల దాడులు చేసి ఉగ్రమూకల స్థావరాలను నేలమట్టం చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ దాడులకు తెగబెడుతున్నది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లోని 24 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీని జారీ చేశాయి. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ జారీ చేసిన అడ్వైజరీలో ప్రయాణికులు తప్పనిసరిగా మూడుగంటల ముందుగానే ఎయిర్‌పోర్ట్‌లకు చేరుకోవాలని సూచించింది. అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలు పెంచినట్లు పేర్కొంది. భద్రతా చర్యలు, చెక్-ఇన్, బోర్డింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రయాణికులు మూడుగంటల ముందుగానే ఎయిర్‌పోర్టులకు చేరుకోవాలని సూచించింది. అలాగే ఇండిగో సైతం సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ అసాధారణ సమయంలో అన్ని విమానాశ్రయాలలో కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.
తనిఖీలు, బోర్డింగ్ తదితర ప్రక్రియల నేపథ్యంలో అదనంగా సమయం కేటాయించాలని కోరుతున్నామని పేర్కొంది. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికనీర్, జోధ్‌పూర్, కిషన్‌గఢ్, రాజ్‌కోట్‌కు ప్రయాణిచేందుకు మే 8 లేదంటే అంతకంటే ముందు చేసిన టికెట్ బుకింగ్‌లను రద్దు చేసేందుకు, తేదీలను మార్చుకునేందుకు ఎలాంటి అదనపు చార్జీలను విధించబోమని ఇండిగో పేర్కొంది. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత మధ్య ఉద్రిక్తతల కారణంగా పంజాబ్, జమ్మూ కశ్మీర్, లడఖ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లోని 24 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ ప్రాంతాలు సరిహద్దుకు సమీపంగా, వ్యూహాత్యకంగా సున్నితమైన ప్రాంతాలు. పఠాన్‌కోఠ్, జలంధర్, జైసల్మేర్ వంటి ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులు చేసిన నేపథ్యంలో భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ చర్యలు తీసుకుంది. ఆయా ఎయిర్‌పోర్టులను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్ని ఎయిర్‌పోర్టులు, విమానయాన సంస్థలకు భద్రత పెంచాలని సూచించింది. విమానాశ్రయాల్లో ఎయిర్మార్షల్స్ని మోహరించనున్నారు.