Supreme Court | కర్నల్ సోఫియా ఖురేషి (Colonel Sofiya Qureshi)పై మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా (Vijay Shah) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ షాపై దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) సీరియస్ అయ్యింది. ఈ విషయంలో ఆయన క్షమాపణలు (apology) అంగీకరించలేమని పేర్కొంది.
కర్నల్ సోఫియా ఖురేషిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ గత వారం మంత్రిని తీవ్రంగా మందలించిన సుప్రీంకోర్టు.. ఆమెకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో ఆయన హైకోర్టులో క్షమాపణలు చెప్పారు. అయితే, ఆయన క్షమాపణలు చెప్పిన తీరుపై న్యాయస్థానం తాజాగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ క్షమాపణలను అంగీకరించలేమని తెలిపింది. ‘మీరు ఎలాంటి క్షమాపణ చెప్పారు..?’ అంటూ ప్రశ్నించింది.
‘మీరు ఎలాంటి క్షమాపణ చెప్పారు..? సారీ చెబుతున్నప్పుడు అందులో కొంత అర్థం ఉండాలి. కొన్నిసార్లు న్యాయ విచారణ నుంచి బయటపడేందుకు కొందరు మర్యాదపూర్వకమైన భాషను ఉపయోగిస్తున్నట్లు నటిస్తారు. మరికొన్నిసార్లు వారు మొసలి కన్నీరు కారుస్తారు. ఇందులో మీ క్షమాపణ ఎలాంటిది..? కోర్టు అడిగింది కదా క్షమాపణ చెబుతున్నా అన్నట్లు ఉంది మీ వ్యవహారం. మీరు చేసిన కఠినమైన వ్యాఖ్యలకు నిజాయితీగా, మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి మీకున్న అభ్యంతరం ఏంటి..?’ అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు బాధ్యతగా వ్యవహరించాలని, ఆచితూచి మాట్లాడాలని చీవాట్లు పెట్టింది. ‘మీ వ్యాఖ్యలతో యావత్ దేశం సిగ్గుపడుతోంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారతీయ సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలను రక్షణ కార్యదర్శి విక్రం మిస్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌తో కలసి కర్నల్ సోఫియా ఖురేషీ విలేకరుల సమావేశాలు నిర్వహించారు. ఉగ్రవాదుల సోదరిగా సోఫియా ఖురేషిని వర్ణించేందుకు ప్రయత్నిస్తూ బీజేపీకి చెందిన గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ సదరు మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Also Read..
Operation Sindoor: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రిపై సిట్ విచారణకు సుప్రీం ఆదేశం