భోపాల్: మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా (MP minister Vijay Shah) కల్నల్ సోఫియా ఖురేషిపై చేసిన అవమానకర, మతపరమైన, లైంగిక వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. మంత్రి విజయ్ షాపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర పోలీస్ చీఫ్‌ను ఆదేశించింది. పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకరంగా భారత్ సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్యల గురించి వివరించారు.
కాగా, మధ్యప్రదేశ్ గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా, మంగళవారం మోవ్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కల్నల్ సోఫియా ఖురేషి నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘వారు (ఉగ్రవాదులు) హిందువుల బట్టలు విప్పి చంపారు. వారి సోదరిని మోదీ పంపారు. మేం వారి బట్టలు విప్పలేకపోయాం. కాబట్టి వారి మతానికి చెందిన ఒక కుమార్తెను పంపాం. మా సంఘంలోని సోదరీమణులను మీరు వితంవులు చేశారు. కాబట్టి మీ సంఘంలోని ఒక సోదరి మిమ్మల్ని వివస్త్రను చేస్తుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి మీ మతం కుమార్తెలను పాకిస్థాన్‌పైకి పంపవచ్చని మోదీ నిరూపించారు’ అని అన్నారు.
మరోవైపు మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా చేసిన ఈ వ్యాఖ్యలపై మజీ సైనిక అధికారులతోపాటు ప్రతిపక్ష పార్టీలు మండిపడ్దాయి. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని విజయ్ షా తెలిపారు. ఎవరైనా తప్పుగా భావిస్తే ఒకసారి కాదు పదిసార్లు క్షమాపణ చెబుతానని అన్నారు.