కోల్కతా, చెన్నై: తమిళనాడు ఒకే విడత ఎన్నికలకు, పశ్చిమ బెంగాల్ మొదటి దశ ఎన్నికలకు ప్రచారం మంగళవారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు, బెంగాల్లో తొలి విడత 152 సీట్లకు ఈ నెల 23న జరిగే ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు అధికారులు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో సర్, ప్రజల ఆహార అలవాట్లు కేంద్రంగా మొదటి విడత ప్రచారం ప్రధాన ప్రత్యర్థులైన అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రెండు పార్టీలు పోటీపడి వాగ్దానాలు గుప్పించాయి.
ఈ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ కూడా రంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టీఎంసీ-బీజేపీ మధ్యే జరుగుతున్నది. మొదటి విడతలో 3.60 కోట్ల మంది ప్రజలు ఓటును వినియోగించుకోనున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సందర్భంగా రికార్డు స్థాయిలో 2,450 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలకు చెందిన 2.5 లక్షల మందిని మోహరించారు. వరుసగా నాలుగోసారీ అధికారం చేపట్టాలని మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఆశపడుతున్నది. అయితే ఆమెను ఎలాగైనా గద్దెదించి తొలిసారిగా బెంగాల్ పీఠం ఎక్కాలని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నది. ఇటీవల ‘సర్’ పేరిట రాష్ట్రంలో 91 లక్ష ఓట్ల తొలగింపుపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది.
యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేస్తామని, చొరబాట్లను అడ్డుకుంటామని, ఉద్యోగాలు కల్పిస్తామని, సరిహద్దులను పటిష్టం చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏను చెల్లిస్తామని కమలం పార్టీ ఈ ఎన్నికల్లో ప్రధానంగా హామీ ఇచ్చింది. ముఖ్యంగా హిందూ ఓట్లపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. సర్ పేరిట అక్రమంగా ఓట్ల తొలగింపునకు పాల్పడిందని, బీజేపీ అధికారంలోకి వస్తే మాంసం, చేపలు, గుడ్లు తినడంపై నిషేధం విధిస్తుందని టీఎంసీ ఆరోపించింది. తాము మరోసారి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీనిచ్చింది.
తమిళనాడులో ఈసారి తొలిసారిగా టీవీకే పార్టీ అధికార, విపక్షాలకు చెమటలు పట్టిస్తున్నది. ఆయన అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోయినప్పటికీ రెండు కూటముల సీట్లను భారీగా చీల్చవచ్చునని అంచనా వేస్తున్నారు.