ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరో మారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కిసాన్ ఆందోళనలో పాల్గొన్న రాహుల్… ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ వ్యవహార శైలి ఓ రాజులా వుందని, ప్రజల ఆలోచనలే వినే స్థితిలో లేరని విమర్శించారు. ఓ సంవత్సరం పాటు తీవ్ర చలిలో, కోవిడ్ పరిస్థితుల్లో కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేశారని, అయినా మోదీ వారితో మాట్లాడడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూపీఏ హయాంలో రైతుల మాట విని పది రోజుల్లోనే 70 వేల కోట్ల రూపాయల రుణాల మాఫీ చేశామని రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులు తమతో భాగస్వాములు కావాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల విషయంలో ఎలాంటి తప్పుడు పనులు చేసిందో, తాము మాత్ర అలా చేయమని, కాంగ్రెస్కు భారీ నష్టం వాటిల్లా, రాజకీయంగా చనిపోయినా, తాము మాత్రం మోదీలాగ చేయమని రాహుల్ ప్రకటించారు.
కాంగ్రెస్ పాలనతోనే రైతులకు తగిన గౌరవం వస్తుందని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్నే చేశారని, ఎంత అణచివేసినా, ఓ పర్వతంలా నిలబడి, ఎదుర్కొన్నారని రాహుల్ రైతులను అభినందించారు. రైతులు దేశానికి అన్నం పెట్టడమే కాకుండా, ఓ దారి కూడా చూపిస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు.