లక్నో: తనను అదుపులోకి తీసుకుని అవమానించిన పోలీసులకు గుణపాఠం చెప్పాలని బీజేపీ నేత భావించాడు. 55 రోజుల పాటు అదృశ్యమయ్యాడు. ఆయన కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కోర్టు మందలింపుతో వెతకడాన్ని విస్తృతం చేశారు. చివరకు ఆ బీజేపీ నేత ఆయన ఇంట్లో ఉన్నట్లు గుర్తించి కోర్టులో హాజరుపర్చారు. (Pritam Singh Kisaan) బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. హమీర్‌పూర్‌కు చెందిన బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ కిసాన్‌కు చెందిన పెట్రోల్ బంకు వద్ద అక్టోబర్ 17న రాత్రివేళ ఒక వివాదం జరిగింది. దీంతో కొందరు వ్యక్తులను గన్‌తో ఆయన బెదిరించారు.
కాగా, దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ప్రీతమ్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాజీ కుదరడంతో మరునాడు ఆయనను వదిలేశారు. స్వాధీనం చేసుకున్న లైసెన్స్ కలిగిన రివాల్వర్‌ను కూడా తిరిగి ఇచ్చారు. అయితే తనను అవమానించిన పోలీసులకు గుణపాఠం చెప్పాలని ప్రీతమ్ సింగ్ నిర్ణయించారు. అక్టోబర్ 18 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
మరోవైపు ప్రీతమ్ సింగ్ కనిపించకపోవడంతో ఆయన కుటుంబం ఆందోళన చెందింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు అక్రమంగా ప్రీతమ్ సింగ్‌ను నిర్బంధించినట్లు ఆయన కుటుంబం ఆరోపించింది. నవంబర్ 28న అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆయనను కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది.
బీజేపీ నేత ప్రీతమ్ సింగ్‌ను వెతికే ప్రయత్నాలను పోలీసులు ముమ్మరం చేశారు. ఆయన పెట్రోల్ బంకు వద్ద పలుసార్లు సోదా చేసినా ఆచూకీ లభించలేదు. డిసెంబర్ 8న ఎస్పీ దీక్షా శర్మ కోర్టుకు హాజరయ్యారు. ఎస్పీ విన్నపంతో ఆయనను హాజరుపరిచే గడువును కోర్టు పొడిగించింది.
చివరకు డిసెంబర్ 12న లక్నోలోని ఇంట్లో ప్రీతమ్ సింగ్‌ను పోలీసులు గుర్తించారు. ఆయనను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. డిసెంబర్ 16 వరకు పోలీస్ కస్టడీకి కోర్టు అప్పగించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఆయనను ఒక వృద్ధాశ్రమంలో ఉంచారు.
Also Read:
Deepathoon | దీపథూన్ హిందువుల స్తంభం కాదు.. జైన సాధువులు వినియోగించారు: తమిళనాడు ప్రభుత్వం