Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో కౌంటింగ్ అంశానికి సంబంధించి హైడ్రామా కొనసాగుతోంది. కౌంటింగ్ అంశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, శనివారం విచారణ జరగనుంది.
జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై రేపు విచారణ జరపనుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న సంగతి తెలిసిందే. రెండో దశ ఎన్నికల సందర్భంగా బెంగాల్లో బీజేపీ, టీఎంసీ నేతల మధ్య అనేక చోట్ల ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం.. కౌంటింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ (పీఎస్యూ) ఉద్యోగులు మాత్రమే కౌంటింగ్ సూపర్వైజర్లుగా, అసిస్టెంట్లుగా పని చేయాలని నిర్ణయించింది.
అయితే, టీఎంసీ కార్యకర్తల్ని, నేతల్ని బెదిరించేందుకే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని టీఎంసీ నేత మమతా బెనర్జీ ఆరోపించారు. ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మే 4న కౌంటింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.