న్యూఢిల్లీ, జూన్ 2: పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి ఇటీవల సస్పెండ్ అయిన ఓ నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉన్నారని, వారంతా ఇటీవల ఒక హోటల్లో సమావేశమయ్యారని, వారికి మూడింట రెండు వంతుల మెజారిటీ ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన టీఎంసీ నాయకుడు రిజు దత్తా చేసిన ఈ వ్యాఖ్యలు బెంగాల్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీ భవిష్యత్తుపై కొత్త ఉత్కంఠను రేకెత్తించాయి.
సీఐడీ దర్యాప్తునకు దారి తీసిన సంతకాల కుంభకోణం లేదా సైన్గేట్ గురించి వివరాలు తెలియచేస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి సమర్పించిన పత్రాల్లో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఆరోపించి పార్టీ నుంచి బహిష్కరణ వేటును ఎదుర్కొన్న ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలు రిటాబ్రత బందోపాధ్యాయ్, సందీపన్ సాహాల గురించి దత్తా మాట్లాడారు. తమ సమస్యలను ప్రస్తావించడానికి పార్టీ నాయకులు పలువురు నేటి మధ్యాహ్నం అసెంబ్లీలో స్పీకర్ను కలిసేందుకు వెళ్లారని ఆయన చెప్పారు. బెంగాల్లో మహారాష్ట్ర మోడల్ అమలు కానున్నట్లు రిజూ దత్తా పేర్కొన్నారు. మూడింట రెండు వంతుల మెజారిటీ కోసం దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు చేతులు కలిపారని ఆయన చెప్పారు. మేమే నిజమైన తృణమూల్ కాంగ్రెస్ కాబట్టి ప్రతిపక్ష నాయకుడు రిటాబ్రత బందోపాధ్యాయ అవుతారు.
శోభనదేబ్ చటోపాధ్యాయ కాదు అని దత్తా వ్యాఖ్యానించారు. ఈ నాయకులకు మెజారిటీ ఉన్నందున పార్టీ చిహ్నాన్ని కూడా వారి వద్దే ఉంచుకోవడానికి అనుమతించాలని ఆయన చెప్పారు. అయితే తన పార్టీ ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మమతా బెనర్జీ వెనక్కి తగ్గడం లేదు. తన మేనల్లుడు, పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం రాష్ట్రంలో ప్రదర్శనకు ఆమె ప్రణాళిక రచించారు. కాగా, టీఎంసీలో బహిరంగంగా నెలకొన్న చీలికకు రిజు దత్తా వ్యాఖ్యలు మొదటి సూచన కాదు. సోమవారం పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేల్లో 61 మంది కీలక సమావేశానికి గైర్హాజరైన తర్వాత సందీపన్ సాహా, రిటాబ్రత బెనర్జీలను పార్టీ నుండి మమత బహిష్కరించారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు.
పశ్చిమబెంగాల్లో తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులకు నిరసనగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం కోల్కతాలో ధర్నా నిర్వహించారు. టీఎంసీ తిరుగుబాటుదారులను ఉద్దేశించి మాట్లాడిన ఆమె తన జీవితంలో ఎవరికైతే మద్దతునిచ్చానో వారు ఇప్పుడు ద్రోహులతో చేతులు కలుపడం తనకు విచారకరంగా ఉందన్నారు. కావాలనుకుంటే తనను అరెస్టు చేసుకోవచ్చని మమత బీజేపీని ఉద్దేశించి సవాల్ విసిరారు.