హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): తిరుమల లడ్డూ వివాదంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ సిట్‌లో ఇద్దరు సీబీఐ, ఇద్దరు ఏపీ పోలీసు అధికారులు, ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఎఐ) నుంచి ఒకరు ఉండాలని సూచించింది. ఈ సిట్ పర్యవేక్షణ బాధ్యతలను సీబీఐ డైరెక్టర్‌కు అప్పగించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ రద్దు అవుతుందని స్పష్టం చేసింది. తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని ఐదుగురు పిటిషన్లు దాఖలు చేశారు.
ఇందులో సీనియర్ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి, చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్‌సంపత్, ప్రవచన కర్త దుష్యంత్, సుదర్శన్ న్యూస్ టీవీ సంపాదకుడు సురేష్ ఖండేరావు, చౌహంన్కే, హిందూసేన అధ్యక్షుడు సూర్జిత్‌సింగ్ యాదవ్ ఉన్నారు. ఈ పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. లడ్డూ వివాదం రాజకీయ డ్రామాగా మారకూడదని స్పష్టంచేసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని గుర్తు చేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలపై పిటిషనర్ల తరపు సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ అభ్యంతరం తెలిపారు. లడ్డూ వివాదానికి సంబంధించి గురువారం కూడా ఏపీ సీఎం చంద్రబాబు మరో ప్రకటన చేశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ వాదనలపై ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ జోక్యం చేసుకొనిఈ కేసుకు సంబంధించిన నివేదిక జూలైలో వచ్చిందని, రెండింటికీ సంబంధం లేదని అన్నారు.
తొలుత కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్(ఎస్జీ) తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవు. కావాలంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకరిని సిట్‌లో చేర్చవచ్చు’ అని కోర్టుకు నివేదించారు. దీనిపై రోహత్గీ జోక్యం చేసుకొని..‘తాము సిట్‌తో విచారణ చేయించాలనుకుంటున్నాం. అందులో మీకు నచ్చిన అధికారిని చేర్చవచ్చు’ అని తెలిపారు.
నెయ్యి ట్యాంకర్లు అసలు సరఫరాదారు నుండి సరఫరా కాలేదని టీటీడీ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పందికొవ్వు ఉపయోగించినట్టు కచ్చితమైన రుజువు ఉందని రోహత్గీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వ్యాఖ్యలను కపిల్ సిబల్ ఖండించారు. ఈ ఆరోపణలను ఏ రిపోర్ట్ చెప్పిందని ప్రశ్నించారు. అందుకు రోహత్గీ నివేదిక చూపించగా.. దానికి కపిల్ సిబల్ జోక్యం చేసుకుని ‘ఇది కూరగాయల కొవ్వు. జంతువుల కొవ్వు కాదు. అందుకే స్వతంత్ర విచారణకు ఆదేశించాలి’ అని డిమాండ్ చేశారు. లూథ్రా స్పందిస్తూ.. జూలై 4 వరకు వచ్చినవి పరీక్షించలేదని, కానీ జూలై 6, 12 తేదీల్లో చేరినవి కల్తీ అయ్యాయని అన్నారు. అయితే, కొండపైకి వెళ్లేందుకు ఎందుకు అనుమతించారని, మీరే బాధ్యత వహించాలని కపిల్ సిబల్ అన్నారు. టెండర్ ఇచ్చింది మీరే(గత ప్రభుత్వం)అని లూత్రా ఆరోపించారు.
“సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఎఐ నుంచి ఒకరితో కూడిన స్వతంత్ర సిట్ దర్యాప్తు జరుగుతుంది’ అని కోర్టు స్పష్టం చేసింది. కోర్టును రాజకీయ యుద్ధభూమిగా ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని పేర్కొన్నది. కోట్లాది మంది ప్రజల అనుమానాలను నివృత్తి చేయడానికి స్వతంత్ర సిట్ దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేసింది.