శ్రీనగర్, మే 13 : జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో లష్కరే తాయిబా (ఎల్ఈటీ) టాప్ కమాండర్ షాహిద్ కుట్టాయ్ కూడా ఉన్నాడు. షోపియాన్ జిల్లాలోని షూకల్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ప్రాంతంలో మంగళవారం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో అక్కడ దాగి ఉన్న ఉగ్రవాదులు వీరిపై కాల్పులు జరిపారు.
దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురు కూడా లష్కరేకు చెందిన వారేనని, మృతుల్లో ఇద్దరిని షాహిద్ కుట్టాయ్, అద్నాన్ షఫీగా గుర్తించామని, మూడో వ్యక్తిని గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు.