Road accident : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ సహా 13 మందితో వెళ్తున్న టెంపో అదుపుతప్పి ఫల్టీలు కొడుతూ రోడ్డు పక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జమ్మూ (Jammu) లోని ప్రభుత్వ ఆస్పత్రి (Government hospital) కి తరలించారు.
టెంపో వ్యాన్ జమ్ము నుంచి సాంగ్లికోట్ వెళ్తుండగా రియాసీ జిల్లాలోని మహోర్ వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ సిబ్బంది, స్థానికులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికిగల కారణం తెలియాల్సి ఉందని చెప్పారు.