చెన్నై, ఏప్రిల్ 17: లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఢిల్లీని తమిళనాడు ఓడించింది: తమిళనాడు పోరాడింది, తమిళనాడు గెలిచింది అని శుక్రవారం స్టాలిన్ ప్రకటించారు. దక్షిణాది ఐక్యంగా నిలిచి తమ గళాన్ని వినిపించడంతో ప్రజాస్వామ్యం విజయం సాధించిందని ఆయన అన్నారు.
ఇది ట్రైలర్ మాత్రమేనని, వచ్చే ఎన్నికల్లోనూ విజయం తమదేనని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును వేరే చేసి లోక్సభలో ఆమోదించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రం అలా చేయలేదని, దీన్ని మహిళలు గమనిస్తున్నారని స్టాలిన్ చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రతిని తాను దగ్ధం చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో స్టాలిన్ పోస్టు చేశారు.
పార్లమెంట్లో బిల్లు వీగిపోయిన వెంటనే డీఎంకే నాయకులు స్వీట్లు పంచుతూ బాణసంచా కాల్చి తమ ఆనందం ప్రకటించారు. ఆ అహంకారానికి మద్దతిచ్చే బానిసలతోపాటు ఢిల్లీ అహంకారాన్ని ఏప్రిల్ 23న (అసెంబ్లీ ఎన్నికల పోలింగ్) ఓడిస్తామని స్టాలిన్ చెప్పారు. ఐక్యంగా నిలిచిన విపక్ష పార్టీలన్నిటికీ నా హృదయపూర్వక అభినందనలు అని ఓ ప్రకటనలో స్టాలిన్ పేర్కొన్నారు.