గాంధీనగర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత నీళ్లు తాగి పది మందికి పైగా మరణించిన కొన్ని రోజులకే బీజేపీ పాలిత గుజరాత్ రాజధాని గాంధీనగర్లో తాగునీళ్లు కలుషితం అయ్యాయి. వంద మందికి పైగా అనారోగ్యం బారిన పడటంతో సివిల్ హాస్పిటల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి వారికి చికిత్స అందిస్తున్నారు. కలుషిత నీటి వల్ల పలువురు చిన్నారులు, మహిళలు టైఫాయిడ్ బారిన పడ్డారు. 30 వేల మంది ప్రజలపై కలుషిత జలాల ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కోట్లాది రూపాయల వ్యయంతో మంచి నీటి పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ పైపు లైన్లలో లీకేజీలు, డ్రైనేజీ నీరు కలవడం వల్ల అవి కలుషితమై వాటిని తాగిన ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.