భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకున్నది. దొంగతనానికి వచ్చిన వ్యక్తులు (Thives) తాము కొల్లగొట్టిన దానికంటే రెండు రెట్ల సొమ్మును కోల్పోయారు. రాత్రి 11 గంటల సమయంలో భోపాల్‌ని అయోధ్య నగర్ ప్రాంతంలో కిరాణా వ్యాపారి నీరజ్ తన దుకాణాన్ని బంద్ చేసి.. నగదుతో స్కూటర్‌పై ఇంటికి బయల్దేరాడు. అదేసమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతని బ్యాగ్ లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో నీరజ్ స్కూటర్‌పై నుంచి కిందపడిపోయాడు. దీంతో బ్యాగ్ కూడా పడిపోయింది.
గమనించిన దొంగలు తమ బైక్‌పైనుంచి దిగి దానిని తీసుకున్నారు. అయితే నీరజ్ కేకలు వేయడంతో స్థానికులు గుమికూడారు. దీంతో దొంగలు తమ బైక్‌పై పారిపోదామని చూడగా, అది స్టార్ట్ కాలేదు. దీంతో తమ కాళ్లకు పనిచేప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాగ్‌లో రూ.80 వేలు ఉన్నాయని, వారు దానిని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు. అయితే దొంగలు వదిలివెళ్లిన బైకును పోలీసులు సీజ్ చేశారు. దాని విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని చెప్పారు. బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా దొంగలను గుర్తిస్తామని, వారిని తొందర్లోనే పట్టుకుంటామని చెప్పారు. ఇదంతా చూసిన స్థానికులు పాపం దొంగలు.. రూ.80 వేలు ఎత్తుకెళ్తే, రూ.2 లక్షలు నష్టపోయారని అన్నారు.