Karnataka | బెంగళూరు : కర్ణాటకలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. నిన్న బీదర్‌లో ఏటీఎం సెంటర్‌కు డబ్బులు తరలిస్తున్న సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపి రూ. 93 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన మరువకముందే తాజాగా దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్ పట్టణంలో పట్టపగలే బ్యాంకులో దోపిడీకి పాల్పడ్డారు. కో ఆపరేటివ్ బ్యాంకులో చొరబడ్డ ఐదుగురు దొంగల ముఠా.. భారీగా బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. ఫియట్ కారులో వచ్చిన దుండగులు తుపాకులతో బ్యాంకు సిబ్బందిని బెదిరించి ఈ చోరీకి పాల్పడ్డారు. రూ. 15 కోట్ల విలువైన బంగారం, రూ. 5 లక్షల నగదును దొంగలు అపహరించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
బ్యాంక్ దోపిడీ అనంతరం మంగళూరు వైపు దొంగలు పరారైనట్లు స్థానికులు తెలిపారు. ఇక వారిని వెంబడించేందుకు స్థానికులు ఎవరూ సాహసం చేయలేకపోయారు. ఎందుకంటే దొంగలు తమపై కాల్పులు జరుపుతారేమోనన్న భయంతో ముందడుగు వేయలేకపోయారు. మంగళూరు పోలీసులు అప్రమత్తమై వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో బీదర్‌కు చెందిన ఇద్దరు దొంగలు తుపాకీతో కాల్పులు జరిపి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. కాల్పుల్లో గాయపడ్డ బస్సు డ్రైవర్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. బీదర్‌లోని శివాజీ చౌక్‌లో గురువారం ఉదయం ఏటీఎం కేంద్రంలో నగదు డిపాజిట్ చేసేందుకు వెళ్తున్న సెక్యూరిటి సిబ్బందిపై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి, వారి దగ్గర నుంచి రూ.93 లక్షలు లాక్కుని పరారయ్యారు.
కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డు, మరో వ్యక్తి మృతి చెందారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ వచ్చిన దుండగులు 3 గంటల పాటు అఫ్జల్‌గంజ్‌లో తలదాచుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. రాత్రి 7 గంటలకు ట్రావెల్స్ బస్ బోయిన్పల్లి నుంచి బయల్దేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అఫ్జల్‌గంజ్ నుంచి సాయంత్రం 6 గంటలకు ట్రావెల్స్ మినీబస్సులో ఎక్కారు. ఈ క్రమంలో బ్యాగును పైన పెట్టేందుకు బస్ డ్రైవర్ ప్రయత్నించాడు. బ్యాగు చాలా బరువుగా ఉండటంతో అనుమానం వచ్చి చూడగా అందులో నగదు గుర్తించాడు. ఇంతలో ఇద్దరు దొంగల్లో ఒకడు తన దగ్గర ఉన్న గన్ తీసుకుని కాల్పులు జరిపి పరార్ అయ్యారు. మరో వ్యక్తిని పట్టుకునేందుకు బీదర్‌తో పాటు రాష్ట్ర పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
eVITARA: ఎలక్ట్రిక్ కారు ఈ-విటారాను ఆవిష్కరించిన మారుతీ సుజుకీ
Tamil Nadu | ఆ వివాదంపై.. తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక
minivan rams into bus | ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన మినీ వ్యాన్.. 9 మంది మృతి