Onion Price in Maharashtra | ముంబై, ఫిబ్రవరి 28: హైదరాబాద్‌లోని మలక్‌పేట్ మార్కెట్లో ప్రస్తుతం నాణ్యమైన కిలో ఉల్లి ధర రూ.16. సింగపూర్‌లో కిలో ఉల్లి ఏకంగా రూ.1200. మహారాష్ట్రలో మాత్రం కిలో ఉల్లి రెండు రూపాయలు. దీంతో మహారాష్ట్ర ఉల్లిరైతు తల్లడిల్లుతున్నారు. ఆ రాష్ట్రంతోపాటు కేంద్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం రైతు గోస అసలు పెద్ద విషయమే కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నది. మంచి డిమాండ్ ఉన్న ఇతర రాష్ర్టాలకు, విదేశాలకు ఎగుమతి చేసి ఉల్లి రైతును ఆదుకొనే అవకాశం ఉన్నా.. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవటంలేదని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. మనదేశంలోనే ఉల్లి మురిగిపోతున్నదంటే.. మోదీ సర్కారు ఇప్పటికీ విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకొంటూనే ఉన్నది. దీంతో రైతులపట్ల మోదీ సర్కారు చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోతున్నదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ఉల్లి ధరలు అమాంతం పడిపోవటంతో మహారాష్ట్ర రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకొన్నది. ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన లసల్గావ్ను రైతన్నలు ముట్టడించి ధర్నా నిర్వహించారు. దీంతో ప్రభుత్వం ఆ మార్కెట్‌ను సోమవారం మూసివేసింది. రైతులను ఆదుకోవాలనుకొంటే ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి ఉల్లిని కొనుగోలు చేసి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేయవచ్చు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం రివర్స్‌లో ఆలోచించి మొత్తం కొనుగోళ్లనే నిలిపేసింది. ఇప్పుడు రైతు తన పంటను ఎక్కడ అమ్ముకోవాలి? రెండుమూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చిన పంటను ఎక్కడ నిల్వ చేసుకోవాలి? సరుకు ట్రక్కుల్లో ఉన్నంతకాలం రోజూ వాహనం కిరాయి పెరిగిపోతూనే ఉంటుంది. మరి ఆ భారాన్ని ఎవరు భరించాలని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితిని ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలని, రైతులకు క్వింటాల్ ఉల్లికి రూ.600 చొప్పున పరిహారం ప్రకటించాలని ఆల్ ఇండియా కిసాన్ సభ కార్యదర్శి అజిత్ నవాలే డిమాండ్ చేశారు.
మనదేశంలో ఉల్లి ధరలు అమాంతం పడిపోయినా తూర్పు ఆసియాతోపాటు ఇతర దేశాల్లో మంచి ధర ఉన్నది. సింగపూర్‌లో కిలో ఉల్లి రూ.1200 పలుకుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆయా దేశాలతో చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వం.. అక్కడికి మన ఉల్లిని ఎగుమతి చేయవచ్చు. కానీ, మోదీ సర్కారు ఇప్పటివరకు అలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా గతంలో కుదుర్చుకొన్న ఒప్పందాల పేరు చెప్పి.. ఇప్పటికీ విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకొంటూనే ఉన్నది. దీంతో దేశీయంగా ఉల్లి ధరలు మరింత పతనమవుతున్నాయని రైతు సంఘాల నేతలు వాపోతున్నారు.
మహారాష్ట్రలో ఉల్లి కిలో రూ.2 పలకటమే కష్టంగా ఉండగా, పక్కనే ఉన్న తెలంగాణలో కిలో రూ.16 వరకు పలుకుతున్నది. అయితే, ఇక్కడిదాకా రైతులు తమ పంటను తీసుకురాలేక.. స్థానికంగానే అదే రూ.2 కే కిలో చొప్పున అమ్ముకొంటున్నారు. ఐదారేండ్ల క్రితం ఉల్లి కిలో రూ. 100 వరకూ వెళ్లింది. ఆ సమయంలో తక్షణం స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. మార్కెట్‌ను నుంచి పెద్ద మొత్తంలో ఉల్లిని కొని రైతు బజార్లలో కిలో రూ.20 చొప్పున వినియోగదారులకు అందజేసింది. అలా సామాన్యుల జేబులకు చిల్లు పడకుండా కాపాడింది. తెలంగాణ ప్రభుత్వంలాగా ఇప్పుడు కష్టాల్లో ఉన్న మహారాష్ట్ర ఉల్లి రైతును అక్కడి బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఆదుకోవటం లేదని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే ఉల్లిని కొని, ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేయవచ్చు కదా? అని సూచిస్తున్నాయి.
ప్రభుత్వాల విధాన లోపాలతో మనదేశంలో ఏటా ఉల్లి సంక్షోభం ఏర్పడుతున్నది. ఒక్కోసారి ధరలు అమాంతం పెరిగిపోతుండగా, మరోసారి అధఃపాతాళానికి పడిపోతున్నది. 1980కి ముందు ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకటంతో ఏకంగా అప్పటి కేంద్ర ప్రభుత్వమే పడిపోయింది. ఏడాదిలోపే 1981లో కిలో ఉల్లి రూ.6కు పడిపోవటంతో ప్రధానిగా ఇందిర తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉల్లి ధరలను నియంత్రించలేకపోవటంతో 1998లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నాటి బీజేపీ ప్రభుత్వం ఓటమి చవిచూసింది. 2010లో రాజస్థాన్‌లోనూ బీజేపీని ఉల్లి ధరలు ప్రతిపక్షంలోకి నెట్టాయి.
ఉల్లిని అత్యధికంగా పండించే రాష్ర్టాల్లో ఈ ఏడాది దిగుబడి విపరీతంగా వచ్చింది. మార్కెట్‌కు ఒక్కసారిగా సరుకు రావటంతో వ్యాపారులు ఉల్లి ధరను దారుణంగా తగ్గించేశారు. గత ఏడాది ఇదే సమయంలో క్వింటాల్ ఉల్లి రూ.2000-రూ.2,500 ధర పలికింది. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.400 కూడా లేదు. దీంతో రైతుకు వచ్చే ఆదాయం సరుకును మార్కెట్‌కు తరలించిన దారి ఖర్చులకు కూడా సరిపోవటంలేదు. వ్యవసాయోత్పత్తులకు దేశంలో తరుచూ ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న భయంతోనే రైతు సంఘాలు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఇవ్వాలని దశాబ్దాలుగా కేంద్రాన్ని కోరుతున్నాయి. కానీ, దేశాన్ని ఏలుతున్న పాలకులకు ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను ఎలా కూల్చాలన్న ధ్యాస తప్ప రైతు గోస పట్టడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంతోపాటు మహారాష్ట్రలోనూ బీజేపీయే అధికారంలో ఉన్నది. ఉల్లి రైతును ఆదుకోవాలన్న ఆలోచన ఉంటే.. ఇలాంటి సమయంలో ప్రభుత్వమే ఉల్లిని సేకరించి దేశంలో మంచి ధర ఉన్న ప్రాంతాలకు ఎగుమతి చేయవచ్చని రైతు సంఘాలు అంటున్నాయి. తెలంగాణలో ఏటా రెండుసార్లు పంట కోతల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి ధాన్యాన్ని స్వయంగా కొంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయోత్పత్తుల ఎగుమతి, దిగుమతి విధానాలను మార్చాలి. ప్రస్తుతం మనదేశంలోనే అవసరానికి మించి ఉల్లి దిగుబడి వచ్చింది. అయినా, కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ నుంచి ఉల్లి దిగుమతులకు అనుమతి ఇచ్చింది. తన ఉల్లిని ఎగుమతి చేస్తున్న బంగ్లాదేశ్, తాను దిగుమతి చేసుకొనే ఉల్లిపై మాత్రం భారీగా పన్నులు వేస్తున్నది. ప్రస్తుతం ఫిలిప్పైన్స్, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఉల్లి ధరలు కొండెక్కాయి. మన ప్రభుత్వం ఆ దేశాలతో చర్చలు జరిపి ఉల్లిని ఎగుమతి చేయవచ్చు. కానీ, మోదీ సర్కారు ఆ దిశగా ఆలోచించటం లేదు.
– అజిత్ నవాలే, ఆల్ ఇండియా కిసాన్ సభ కార్యదర్శి