Vijay TVK: తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ ఈ ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోతుంది. ఈ నేపథ్యంలో టీవీకే ఒంటరిగా
పోటీచేస్తుందా లేక మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం టీవీకే.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు
తెలుస్తోంది. దీనిపై టీవీకే జాతీయ ప్రతినిధి గెరాల్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీకే, కాంగ్రెస్ సహజ భాగస్వాములు అని చెప్పారు. రెండు పార్టీలు లౌకిక వాదానికి కట్టుబడి ఉన్నాయని,
మత తత్వానికి వ్యతిరేకమని తెలిపారు.
అందుకే రెండు పార్టీలు సహజ భాగస్వాములని, తమ అధినేత విజయ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంచి మిత్రులని కూడా గెరాల్డ్ అన్నారు. అయితే, రెండు పార్టీలు కలిసి పనిచేసే విషయంలో కొన్ని సమస్యలున్నాయని, ముఖ్యంగా తమిళనాడు కాంగ్రెస్ విభాగంతో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. ‘‘భవిష్యత్ లో టీవీకే, కాంగ్రెస్ కలిసి పనిచేయొచ్చు. అయితే, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై టీవీకేతో చర్చించేందుకు అడ్డు పడుతుండొచ్చు’’ అని గెరాల్డ్ అభిప్రాయపడ్డారు. కాగా, రెండు పార్టీల పొత్తు గురించి ఇటీవల ప్రచారం జరుగుతోంది.
గత నెలలో జరిగిన టీవీకే సమావేశానికి కొందరు కాంగ్రెస్ నేతలు కూడా హాజరవ్వడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లైంది. ఒకవేళ టీవీకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు టీవీకేతో పొత్తు కోసం తమిళనాడులోని ఏఐఏడీఎంకే పార్టీ కూడా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.