కోల్కతా, సెప్టెంబర్ 7: నిరుపేద కూలీలకు ఉపాధి హామీ కల్పించే ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకానికి కేంద్రం నిధుల విడుదల నిలిపివేయడం పట్ల పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ చర్యను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో మూడు ప్రాంతాల్లో తాము ఆందోళన నిర్వహిస్తామని, దానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ పోలీస్ స్టేషన్ డీసీపీకి లేఖ రాశారు.
నిధుల విడుదలలో కేంద్రం పక్షపాత వైఖరిని ఖండిస్తూ జంతర్ మంతర్, కృషి భవన్ వెలుపల, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఇంటి ముందు అక్టోబర్ 2, 3 తేదీల్లో నిరసన వ్యక్తం చేస్తామని ఆయన చెప్పారు. వీటికి అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆ నిరసనలకు నేతృత్వం వహిస్తారని చెప్పారు.