Karnataka Elections | న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన పాలనలో తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు అక్రమాలకు, లంచగొడి పనులకు పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. సీఎం బొమ్మైతో పాటు ఆయన మంత్రివర్గ అనుచరులపై కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి తీవ్ర ఆరోపణలున్నాయి. బొమ్మై ప్రభుత్వ హయాంలో 40 శాతం కమీషన్ ఇవ్వందే ఏ ఫైలూ ముందుకు కదలడం లేదని రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు, పలువురు పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. అయితే తాము ప్రభుత్వ అవినీతి అంశానికే తొలి ప్రాధాన్యం ఇచ్చి వారికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఓటర్లు చెప్పినట్టు ఒక సర్వే వెల్లడించడంతో అధికార పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది.
అవినీతి సమస్యనే ఓటర్లు ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. దీని ప్రాతిపాదికనే తాము అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు ఓటు వేస్తామని మెజారిటీ ఓటర్లు తెలిపారు. ఎడీనా అనే సంస్థ కర్ణాటకలో జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అవినీతికి వ్యతిరేకంగానే ఓటు వేస్తామని 68 శాతం ఓటర్లు తెలియజేశారు. అన్ని పార్టీల మద్దతుదారులు కూడా తాము అవినీతికి వ్యతిరేకమని చెప్పారు. 77 శాతం కాంగ్రెస్ మద్దతుదారులు, 66 శాతం జనతాదళ్, 61 శాతం బీజేపీ మద్దతుదారులు తాము అవినీతికి వ్యతిరేకంగా ఓటేస్తామన్నారు.
183 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ అభిప్రాయ సేకరణ జరిపారు. ఒక్కో నియోజకవర్గంలోని 16 బూత్‌లను ఎంపిక చేశారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి వివరాలు సేకరించారు. 40 వేల మందిని సర్వే చేశారు. ఇంకా 28 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించాల్సి ఉన్నది. సమాజంలోని వివిధ కులాల ఓటర్లను ఈ సర్వేలో ప్రశ్నించారు. అభిప్రాయాలు తెల్పినవారిలో 55 శాతం మంది పురుషులు, 45 శాతం స్త్రీలు ఉన్నారు.
