BJP | న్యూఢిల్లీ, జూన్ 7: కమలం పార్టీలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. భారీగా సీట్లు తగ్గిపోవడం, సొంతంగా మ్యాజిక్ ఫిగర్ అందుకోకపోవడం పట్ల పార్టీ నేతలు, శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొన్నది. మూడోసారి అధికారం చేపడుతున్నప్పటికీ ఎక్కడా ఆ ఆనందం కనిపించడం లేదు. పైగా అసమ్మతి మొదలైంది. పదేండ్ల తర్వాత మోదీ – షా నాయకత్వంపై మొదటిసారి అసంతృప్త నేతలు గళమెత్తుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో లోపాలు జరిగాయని పరోక్షంగా నాయకత్వం తప్పులను ఎత్తి చూపుతున్నారు. దీంతో బీజేపీలో గతంలో లేని విధంగా అసమ్మతి కనిపిస్తున్నది.
లోక్‌సభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వివిధ రాష్ర్టాల్లో బీజేపీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. గత ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి 41 సీట్లు రాగా ఈసారి కేవలం 17 సీట్లే దక్కాయి. 23 సీట్ల నుంచి బీజేపీ బలం తొమ్మిది స్థానాలకు పడిపోయింది. దీంతో పార్టీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తానని ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ పరిణామాలకు సంబంధించి శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు మరింత కీలకంగా మారాయి. యూపీలో ఫలితాలకు బాధ్యత వహిస్తూ యూపీ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగేలా యోగి ఆధిత్యనాథ్‌పై ఒత్తిడి తెచ్చేందుకే ఫడ్నవీస్ రాజీనామా ప్రకటన చేశారని సంజయ్ రౌత్ వెల్లడించారు. ప్రధాని మోదీకి ఫడ్నవీస్ సన్నిహితుడు కావడం ఇక్కడ గమనార్హం.
గత పదేండ్లుగా బీజేపీలో నరేంద్ర మోదీ – అమిత్ షా నాయకత్వానికి ఎదురులేకుండా ఉండేది. అయితే, ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో మొదటిసారి మోదీ – షా ద్వయంపై అసంతృప్తి మొదలైంది. ఉత్తరప్రదేశ్‌లో పార్టీ పేలవ ప్రదర్శనకు కేంద్ర నాయకత్వానిదే బాధ్యత అని ముఖ్యమంత్రి యోగి మద్దతుదారులు పరోక్షంగా ఆరోపిస్తున్నారు. యూపీలో 29 స్థానాలు బీజేపీకి తగ్గడానికి ప్రధాన కారణం అభ్యర్థుల ఎంపిక అని లేవనెత్తుతున్నారు. కాగా, అభ్యర్థుల ఎంపికలో యోగిని పక్కనపెట్టారని వీరు గుర్తు చేస్తున్నారు. బెంగాల్లోనూ 18 సానాల నుంచి 12 స్థానాలకు బీజేపీ పడిపోవడం పట్ల అసంతృప్తి మొదలైది.
రాష్ట్ర బీజేపీ కీలక నేత, అసెంబ్లీ ప్రతిపక్ష నేత సువేంధు అధికారిని ఉద్దేశించి పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పరోక్ష విమర్శలు గుప్పించారు. పది మంది కొత్త కార్యకర్తలను వదులుకున్నా పర్వాలేదు కానీ ఒక్క పాత కార్యకర్తను కూడా నిర్లక్ష్యం చేయవద్దని ఆయన సువేందును ఉద్దేశించి వ్యాఖ్యానిచారు. తనను చివరి నిమిషంలో సిట్టింగ్ స్థానం నుంచి తప్పించి మరో స్థానంలో పోటీ చేయించడాన్నీ తప్పుబట్టారు. మరోవైపు రాజస్థాన్‌లోనూ బీజేపీ గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే 11 స్థానాలను కోల్పోయింది. టికెట్ల కేటాయింపులో తప్పులు జరిగాయని, రైతుల సమస్యలు కూడా ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలకు కారణమని ఆ రాష్ట్రమంత్రి, సీనియర్ నేత జబర్ సింగ్ ఖర్రా బాహాటంగానే మాట్లాడటం పార్టీలో చర్చనీయాంశమైంది.
మోదీ, అమిత్ షాకు సన్నిహితుడిగా పేరున్న ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక మోదీ – షా ద్వయానికి సవాల్‌గా మారింది. ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న మోదీ, షా వ్యతిరేక నేతలు ఇప్పుడు తెరమీదకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో వ్యవస్థాగత మార్పులు, నాయకత్వ మార్పు కోరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కొత్త అధ్యక్షుడి ఎంపికలో ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎంపీలుగా మరోసారి గెలిచిన నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పెద్దపీట వేయాల్సిన పరిస్థితులు రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒకవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాక నైరాశ్యంలో ఉన్న బీజేపీకి త్వరలోనే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌లో మరో పరీక్ష ఎదురుకానున్నది. ఈ ఏడాదే ఈ మూడు రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ర్టాల్లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీగా నష్టపోయింది. గత ఎన్నికల్లో సాధించిన సీట్లలో సగం సీట్లు కోల్పోయింది. మహారాష్ట్రలో ఫడ్నవీస్ రాజీనామా ప్రకటనతో పార్టీలో అనిశ్చితి నెలకొన్నది. జార్ఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అరెస్టుతో జేఎంఎంపై సానుభూతి ఉంది. హర్యానాలో జేజేపీతో పేచీ, రైతుల సమస్యలు, అగ్నిపథ్ పథకం బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు రాష్ర్టాల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో బీజేపీకి ఈ ఎన్నికలు మరో పరీక్షగా మారాయి.